అమెరికా ప్రతీకారం.. ఇద్దరు రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన అగ్రరాజ్యం
గత నెలలో ఇద్దరు అమెరికా దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించిన విషయం తెలిసిందే. అమెరికా తాజాగా దానికి ప్రతీకారం తీర్చుకుంది. రష్యాకు చెందిన ఇద్దరు రాయబారులను యూఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో గల యూఎస్ కాన్సులేట్‌లో మాజీ ఉద్యోగి అయిన ఒక రష్యన్ గుఢచార్యానికి పాల్పడినట్లు తేలింది. దీంతో పుతిన్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసింది. గుఢచర్యానికి పాల్పడిన వ్యక్తితో ఇద్దరు అమెరికన్ దౌత్యవేత్తలు సన్నిహితంగా ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో వారిని రష్యా బష్కరించింది. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా విదేశాంగ శాఖ రష్యా దౌత్యవేత్తలపై ఈ చర్య తీసుకుంది.
తన దౌత్యవేత్తలను వేధిస్తే ఊరుకునేది లేదు: అమెరికా
తన దౌత్యవేత్తలపై రష్యా ప్రభుత్వం వేధింపుల తీరును సహించేది లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మాస్కోలోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిపై ఆమోదయోగ్యం కాని చర్యలకు గుణపాఠం తప్పదన్నారు. ఉక్రెయిలన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో కూడా వాషింగ్టన్, మాస్కో మధ్య దౌత్యవేత్తల బహిష్కరణలు జరిగాయి. ఈ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారణంగా క్షీణించాయి. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబర్ నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం మళ్లీ రాజుకుంది. ఇప్పుడు రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించడంతో అది మరింత ముదిరిందనే చెప్పాలి.