New Zealand: న్యూజిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పంజాబీ యువకులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌లో దీపావళి పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఆక్లాండ్‌లోని టకానిని ప్రాంతంలో ఓ కారు అదుపుతప్పి రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పంజాబీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 8, ఆదివారం రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో గ్రేట్ సౌత్ రోడ్డులోని రౌండబౌట్ వద్ద ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అనంతరం అక్కడి కంచెను ఢీకొట్టి నేరుగా బర్గర్‌ఫ్యూయల్ రెస్టారెంట్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు టకానిని పోలీసులు వెల్లడించారు.
వివరాలు
స్పందించిన సుప్రీం సిక్కు సొసైటీ అధ్యక్షుడు దల్జీత్ సింగ్
మృతులంతా పంజాబీ మూలాలున్న యువకులేనని న్యూజిలాండ్‌లోని సెంట్రల్ సిక్కు అసోసియేషన్, సుప్రీం సిక్కు సొసైటీ అధ్యక్షుడు దల్జీత్ సింగ్ తెలిపారు.
మంగళవారం ఆయన ఈ ఘటనపై స్పందించారు. దీపావళి పండుగ రాత్రి ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం పంజాబీ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.
అయితే, మృతులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేశారు.
మృతదేహాలను భారత్‌కు తరలించాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయని దల్జీత్ సింగ్ తెలిపారు.
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు పూర్తయి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
వివరాలు
న్యూజిలాండ్ పోలీసుల సీరియస్ క్రాష్ యూనిట్ దర్యాప్తు
మరోవైపు, ఈ ప్రమాదానికి గల కారణాలపై న్యూజిలాండ్ పోలీసుల సీరియస్ క్రాష్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది.
ప్రమాదానికి ముందు సదరు వాహనంపై ఎలాంటి డ్రైవింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.
ఆ కారు చోరీకి గురైనట్లు కూడా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించడం లేదని వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసివేసి ఉన్నప్పటికీ, కొందరు సిబ్బంది లోపలే ఉన్నారు.
అయితే, వారిలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. కారు బలంగా ఢీకొనడంతో రెస్టారెంట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నది.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.