హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం.. 4రోజుల కాల్పుల విరమణ.. 50మంది బందీల విడుదల
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గాజాలో 4రోజులు పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. దీనికి బదులుగా తమ చేతిలో ఉన్న బందీల్లో 50 మందిని విడుదల చేస్తామని పాలస్తీనా మిలిటెంట్ల సంస్థ హమాస్ ప్రకటించింది. ఈ మేరకు ఒప్పందానికి అంగీకరిస్తూ.. ఇరు వర్గాలు తమ ప్రకటనలను విడుదల చేశాయి. హమాస్‌తో ఒప్పందం చేసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్ మంగళవారం రాత్రంతా చర్చించింది. చివరకు హమాస్‌తో ఈ ఒప్పందానికి తాము సిద్ధమని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ జరిగిన ఒప్పందాన్ని హమాస్ స్వాగతించింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న 150 పాలస్తీనా మహిళలు, పిల్లలను ఆ దేశం విడుదల చేస్తుందని హమాస్ పేర్కొంది.
గాజాలోకి ఇంధనం సరఫరాకు ఇజ్రాయెల్ అంగీకారం
ఇజ్రాయెల్ విడుదల చేసిన ప్రకటనలో పాలస్తీనా ఖైదీల విడుదల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. హమాస్ చెప్పిన దాని ప్రకారం.. జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుందా? ఒక వేళ చేస్తే ఎంత మందిని రిలీజ్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరొక ముఖ్యమైన ఒప్పందం ఏంటంటే.. అదనపు ఇంధనాన్ని, పెద్ద మొత్తంలో మానవతా సహాయాన్ని గాజాలోకి అనుమతించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. హమాస్‌ను నిరోధించేందుకు ఇన్నాళ్లు గాజాలోకి ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిరోధించింది. మొదట, బందీలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగిస్తుంది. ఆ తర్వాత రెడ్ క్రాస్ వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగిస్తుంది.