Strait of Hormuz: యుద్ధ వేళ అమెరికా కీలక ఆపరేషన్.. హర్మూజ్ దాటిన 40 నౌకలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న సమయంలో వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిలో అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 40 వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం భద్రత కల్పించగా.. అవన్నీ సురక్షితంగా జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నౌకల ద్వారా సుమారు 18 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలించినట్లు సమాచారం. యుద్ధ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలకు అమెరికా నౌకాదళం రక్షణ కల్పించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి సైనిక ఘర్షణలు చోటుచేసుకోవడంతో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆందోళనలు పెరిగాయి.
వివరాలు
పెరుగుతున్న ముడిచమురు ధరలు
ఇటీవల అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన రాడార్, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు తీర ప్రాంతంలోని పలు కీలక స్థావరాలపై దాడులు నిర్వహించాయి.
దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా దాడులకు దిగుతోంది. ఇరుదేశాల మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి.
చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ మార్గంలో రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంలో భాగంగానే అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రపంచ చమురు సరఫరాలో హర్మూజ్ జలసంధికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఈ మార్గం ద్వారా నౌకల రాకపోకలు సజావుగా సాగడం అమెరికాకు, అంతర్జాతీయ మార్కెట్లకు అత్యంత కీలకంగా మారింది.
వివరాలు
సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించిన అమెరికా
యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదని తాజా పరిణామాలను పరిశీలిస్తున్న నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై నియంత్రణను మరింత బలోపేతం చేసుకోవడం అమెరికాకు వ్యూహాత్మకంగా కీలకమని విశ్లేషిస్తున్నారు.
ఇప్పటివరకు ప్రధానంగా సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించిన అమెరికా.. తాజాగా వాణిజ్య నౌకల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తాజా ఆపరేషన్ స్పష్టం చేస్తోంది.