LOADING...
Philippines: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రత భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు
ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రత భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు

Philippines: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రత భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ ఫిలిప్పీన్స్‌ను సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల ప్రభావంతో తీరప్రాంత నగరాల్లో ఆస్తినష్టం సంభవించింది. ముఖ్యంగా సుమారు 7 లక్షల జనాభా కలిగిన జనరల్‌ శాంటోస్‌ నగరం తీవ్రంగా వణికిపోయింది. ట్యూనా ప్రాసెసింగ్‌ పరిశ్రమకు కేంద్రంగా పేరుగాంచిన ఈ నగరంలో ఉన్న జనరల్‌ శాంటోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భూకంపం కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం, జనరల్‌ శాంటోస్‌కు నైరుతి దిశగా సుమారు 8 మైళ్ల దూరంలో, 6.2 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

వివరాలు

తైవాన్‌, జపాన్‌, పపువా న్యూ గినియా దేశాలపై భూకంప ప్రభావం

భూకంపం అనంతరం సముద్రంలో అలజడి ఏర్పడటంతో 10 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు విరుచుకుపడే ప్రమాదం ఉందని ఫిలిప్పీన్స్‌ ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఇండోనేషియా, మలేసియా తీర ప్రాంతాల్లో కూడా సముద్రపు అలలు సుమారు 3 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్‌ సునామీ సెంటర్‌ వెల్లడించింది. అలాగే తైవాన్‌, జపాన్‌, పపువా న్యూ గినియా దేశాలపై కూడా ఈ భూకంప ప్రభావం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌ తీర ప్రాంతాల్లో సుమారు మూడు అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడినట్లు అధికారులు తెలిపారు.

Advertisement