టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు చెప్పారు. శక్తిమంతమైన ప్రకంపనాలకు గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని అనేక భవనాలు నెలమట్టం కాగా, 53మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. టర్కీ సరిహద్దులోని సిరియాలో వచ్చిన భూకంపం వల్ల 43మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. నిద్రిస్తున్న సమయంలో భూకంపం రావడం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాలకు వెంటనే రెస్క్యూ బృందాలను పంపించామని టర్కీ అధ్యక్షుడు తెలిపారు. వరుసగా వచ్చిన భూకంపాల కారణంగా భవనాలు కూలిపోయాయని, చాలా మంది శిథిలాల మధ్య చిక్కుకున్నారని బీఎన్ఓ న్యూస్ నివేదించింది.
నిమిషాల వ్యవధిలోనే 6.7 తీవ్రతతో మరో భూకంపం
దక్షిణ టర్కీలో రిక్టర్ స్కేల్‌పై 7.8తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే 6.7తీవ్రతతో మరోసారి బలమైన ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. మొదటిసారి వచ్చిని భూకంపం గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నూర్దగి నగరానికి తూర్పున 26 కి.మీ దూరంలో 17.9కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు జియోలాజికల్ సర్వే వివరించింది. రెండోసారి సెంట్రల్ టర్కీలో భూకంకం రాగా, ఇది తూర్పున 350 కిమీ దూరంలోని దియార్‌బాకిర్‌లో 9.9 కి.మీ లోతులో కేంద్రీకృతమైనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రకంపనలు ఒక నిమిషం పాటు కొనసాగినట్లు చెప్పింది. గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని, సహాయ కోసం అరుస్తున్నట్లు టర్కిష్ రెడ్‌క్రాస్ చీఫ్ వెల్లడించారు.