Page Loader
అమెరికాలో తప్పిపోయిన ఖరీదైన ఫైటర్ జెట్.. కనిపిస్తే చెప్పాలని ప్రజలకు వేడుకోలు
కనిపిస్తే చెప్పాలని ప్రజలకు అభ్యర్థన

అమెరికాలో తప్పిపోయిన ఖరీదైన ఫైటర్ జెట్.. కనిపిస్తే చెప్పాలని ప్రజలకు వేడుకోలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 18, 2023
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో ఫైటర్‌ జెట్ తప్పిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ మేరకు దాని జాడకోసం ఆ దేశ వాయుసేన తీవ్రంగా గాలిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు గుప్పుమన్నాయి. సదరు యుద్ధ విమానం గాల్లో ఉండగానే అత్యవసర పరిస్థితి తలెత్తింది. సౌత్‌ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి అమెరికా ఫైటర్ జెట్‌ ఎఫ్‌-35 (F-35 Fighter Jet) జాడ కానరాకుండా పోయింది. జెట్ విలువ వందలాది కోట్లల్లో ఉంటుందని అధికారులు అంటున్నారు. అలాంటి ఖరీదైన జెట్ జాడలేకపోవడంతో మిలిటరీ యంత్రాంగం ఆందోళన చెందుతున్నారు.

DETAILS

ట్రాకింగ్‌ పరికరం ఏమైందంటూ నిలదీత

అమెరికాలోని పోర్టు నగరం చార్లెస్టన్‌లో ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్‌తో కలిసి మిస్ అయిన జెట్ కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. నగరంలోని రెండు సరస్సులను సైతం గాలించారు. ఈ మేరకు స్థానికులు సైతం వాయుసేన అధికారులతో పాటు భద్రతా దళాలకు సహకరించాలని సూచించారు. ప్రజల వద్ద ఎటువంటి సమాచారమున్నా తమతో పంచుకోవాలని కోరారు. ట్రాకింగ్‌ పరికరం ఏమైందంటూ పలువురు అగ్రరాజ్య వాయుసేన(ఎయిర్ ఫోర్స్) అధికారులను నిలదీస్తున్నారు. ఆదివారం జరిగిన సంఘటనలో పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడటం గమనార్హం. లాక్‌హీడ్ మార్టిన్‌ సంస్థ తయారు చేసిన ఎఫ్‌-35 జెట్‌ను ధర దాదాపుగా 80 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.