మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
కరోనా కంటే ప్రమాదకర మహమ్మారి పొంచి ఉందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. భవిష్యత్‌లో వచ్చే మహమ్మారిని నివారించడంపై ప్రపంచ దేశాలు చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సభకు టెడ్రోస్ తన నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా కథ దాదాపు ముగిసినట్లేనని ఇటీవల గ్లోబల్ హెల్త్ బాడీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా కారణంగా 20మిలియన్ల కంటే ఎక్కువ మరణాలు: డబ్ల్యూహెచ్‌ఓ
ప్రజారోగ్యానికి అతిపెద్ద ముప్పుగా భావించే తొమ్మిది వ్యాధులను గుర్తించింది డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల గుర్తించింది. ఇవి మహమ్మారిగా మారే అవకాశం ఉందని చెప్పింది. వీటికి చికిత్స లేకపోవడం వల్ల అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. శతాబ్దంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం కోవిడ్ అని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. గత మూడు సంవత్సరాల్లో కరోనా ప్రపంచాన్ని తలకిందులు చేసినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా అధికారికంగా ఏడు మిలియన్ల మరణాలు నమోదయ్యాయని, అయితే అనధికారకంగా 20 మిలియన్ల మరణాల కంటే ఎక్కవగానే నమోదు కావొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ భావిస్తోంది.