Hate against South Asians: అమెరికాలో దక్షిణాసియా వాసులపై ఆన్‌లైన్ ద్వేషం.. 240 శాతం పెరిగిన పోస్టులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా వాసులు, ముఖ్యంగా భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంతతికి చెందిన నిపుణులపై ఆన్‌లైన్ వేదికల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు,వర్ణ వివక్ష పెరుగుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే 'సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్' (సీఎస్‌వోహెచ్)ఈ అంశంపై విడుదల చేసిన నివేదికలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఆన్‌లైన్‌లో భారీగా పెరిగిన విద్వేష పోస్టులు ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో దక్షిణాసియా వ్యతిరేక పోస్టులు భారీగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2024 జనవరిలో నెలకు సగటున 12,904 విద్వేషపూరిత పోస్టులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2026 జూన్ నాటికి 43,843కు చేరింది. అంటే ఈ కాలంలో ఇలాంటి పోస్టుల్లో 240 శాతం పెరుగుదల నమోదైంది.
వివరాలు
హెచ్-1బీ వీసాల చర్చతో మరింత తీవ్రత
2025 జనవరి నుంచి 2026 జూన్ మధ్య కాలంలోనే 5 లక్షలకు పైగా దక్షిణాసియా వ్యతిరేక పోస్టులు వెలుగుచూశాయని నివేదిక తెలిపింది.
భారత సంతతికి చెందిన అమెరికన్ ప్రముఖులు వివేక్ రామస్వామి, శ్రీరామ్ కృష్ణన్, అలాగే ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాలకు అనుకూలంగా మాట్లాడిన తర్వాత ఆన్‌లైన్‌లో దక్షిణాసియా వ్యతిరేక వ్యాఖ్యలు మరింత పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంలో కఠినమైన వలస విధానాలు, వలస కార్మికులపై చర్యలు, 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' ఉద్యమ ప్రభావం కూడా ఈ తరహా ఆన్‌లైన్ ద్వేషం పెరగడానికి కారణాలుగా నివేదికలో ప్రస్తావించారు.
వివరాలు
భారతీయులపై ఉద్యోగాల విషయంలో అపోహలు
హెచ్-1బీ వీసాదారుల్లో 70 శాతానికిపైగా భారతీయులే ఉన్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. కొందరు నెటిజన్లు అమెరికన్ల ఉద్యోగాలను దక్షిణాసియా వాసులు దక్కించుకుంటున్నారనే అపోహలను ప్రచారం చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.
ఈ కారణంగా భారతీయులు సహా దక్షిణాసియా వాసులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొంది.
వివరాలు
ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపొచ్చు
ఈ పరిణామాలపై ప్రముఖ మీడియా పలువురు అంతర్జాతీయ నిపుణులతో చర్చించింది.
విదేశీ వ్యవహారాల శాఖ మాజీ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలు సమాజంలోని కొన్ని వర్గాలను ప్రభావితం చేసి, రెచ్చగొట్టే పరిస్థితులకు దారితీస్తాయని అన్నారు.
అమెరికా ఐటీ, ఏఐ రంగాల అభివృద్ధిలో భారతీయ నిపుణుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
దక్షిణాసియా వాసులపై ద్వేషపూరిత వాతావరణం కొనసాగితే వారి మనోధైర్యంపై ప్రభావం పడటంతో పాటు, దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక ప్రయోజనాలపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ప్రజల మధ్య సంబంధాలే కీలకమన్న నిపుణులు
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్షు జోషి మాట్లాడుతూ.. అమెరికా-భారత్ సంబంధాలకు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న అనుబంధమే ప్రధాన ఆధారమని గుర్తుచేశారు.
ఆన్‌లైన్‌లో పెరుగుతున్న ఇలాంటి విద్వేషపూరిత పోస్టులు అమెరికాలోని భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.