LOADING...
Iran Protests: ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ సమయంలో ఇరాన్‌లో కనీసం 12,000 మంది మృతి?
ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ సమయంలో ఇరాన్‌లో కనీసం 12,000 మంది మృతి?

Iran Protests: ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ సమయంలో ఇరాన్‌లో కనీసం 12,000 మంది మృతి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 600 మందికి పైగా మృతి చెందినట్లు వెల్లడైంది. అయితే వాస్తవ మరణాల సంఖ్య రెండు వేల వరకు చేరి ఉండవచ్చని ఇరాన్‌ అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. అక్కడ పెరుగుతున్న హింస తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ కూడా వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో, ఇరాన్‌కు చెందిన ఒక వెబ్‌సైట్‌ తాజాగా జరిగిన ఆందోళనల్లో 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని సంచలన కథనాన్ని ప్రచురించింది.

వివరాలు 

కనీవినీ ఎరుగని హింస..! 

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో సాధారణ ప్రజలతో పాటు భద్రతా బలగాల సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఇరాన్‌ అధికారులు తెలిపారు. ఈ మరణాలకు ఉగ్రవాదులే కారణమని వారు ఆరోపించారు.మరోవైపు,'ఇరాన్‌ ఇంటర్నేషనల్‌'సంస్థ ఇటీవల జరిగిన ఘర్షణల్లో దాదాపు 12 వేల మంది మృతి చెందినట్లు తన కథనంలో పేర్కొంది. భద్రతా ఏజెన్సీలు,అధ్యక్ష కార్యాలయం,ప్రత్యక్ష సాక్షులు,వైద్య అధికారులు తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని తెలిపింది. జనవరి 8, 9 తేదీల్లోనే ఎక్కువగా ఈ మరణాలు చోటుచేసుకున్నాయని, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారమే హింసాత్మక ఘటనలు జరిగాయని వెల్లడించింది. ఆధునిక ఇరాన్‌ చరిత్రలో ఇంతటి స్థాయి హింస ఎప్పుడూ చూడలేదని ఆ కథనం పేర్కొంది.

వివరాలు 

మరణశిక్ష భయం..? 

దేశంలోని 31 ప్రావిన్సుల్లోని 600కుపైగా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఆందోళనల్లో వందలాది మంది మృతి చెందగా, 10 వేల మందికిపైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపింది. ఇలాంటి భయానక హింసాత్మక పరిస్థితులు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ఐరాస మానవ హక్కుల హైకమిషన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ పౌరుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తప్పనిసరిగా వినాలని సూచించింది. మరణాల సంఖ్య వందల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి జెరెమీ లారెన్స్‌ తెలిపారు. అదేవిధంగా, అరెస్టైన వారిలో పలువురికి మరణశిక్ష పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement