Australia: ఆస్ట్రేలియా వీసా కొత్త నిబంధనలు.. భారతీయులపై ప్రభావం ఎంత?
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారు, పర్యాటకులు వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులను తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా ప్రక్రియలో భాగంగా కొందరు భారతీయ దరఖాస్తుదారులకు బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం అవసరమైన దరఖాస్తుదారుల నుంచి వేలిముద్రలు, ముఖ చిత్రాన్ని సేకరించనున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులపై ఈ మార్పు ప్రభావం చూపనుంది.
వివరాలు
బయోమెట్రిక్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఆస్ట్రేలియా వీసాకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు.
ఎవరి నుంచి ఈ వివరాలు అవసరమో వారికి ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారికంగా సమాచారం అందిస్తుంది.
ఈ నోటిఫికేషన్ అందుకున్న వారు మాత్రమే తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలి.
బయోమెట్రిక్ వివరాలు సమర్పించాల్సిన వారు దేశవ్యాప్తంగా వీఎఫ్ఎస్ గ్లోబల్ నిర్వహిస్తున్న 16 కేంద్రాల్లో ఏదో ఒకదానికి వెళ్లాల్సి ఉంటుంది.
అర్హత ఉన్నవారికి 'ఆస్ట్రేలియన్ ఇమ్మి యాప్' ద్వారా బయోమెట్రిక్ వివరాలు సమర్పించే అవకాశం కూడా ఉంది.
అయితే,హోం వ్యవహారాల శాఖ నుంచి అధికారిక అభ్యర్థన అందకముందే బయోమెట్రిక్ కేంద్రంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం లేదా యాప్‌ను ఉపయోగించడం చేయకూడదని ప్రభుత్వం సూచించింది.
వివరాలు
విద్యార్థులపై ప్రభావం ఎంత?
కొత్త నిబంధనలతో ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తు ప్రక్రియలో మరో దశ చేరింది.
అయితే, ప్రతి విద్యార్థి బయోమెట్రిక్ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు.
ఎవరి దరఖాస్తుకు ఈ వివరాలు అవసరమో వారికి ప్రభుత్వం అధికారికంగా తెలియజేస్తుంది.
అధికారిక అభ్యర్థన అందిన వెంటనే బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేస్తే వీసా ప్రాసెసింగ్ సమయంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
అందువల్ల విద్యార్థులు వీసా దరఖాస్తు సమర్పించిన తర్వాత తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
ప్రభుత్వ శాఖ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈమెయిల్‌ను తరచూ పరిశీలిస్తూ ఉండాలి.
వివరాలు
బయోమెట్రిక్ తనిఖీలు ఎందుకు?
వీసా దరఖాస్తుదారుల గుర్తింపును మరింత కచ్చితంగా నిర్ధారించడం, వీసా మోసాలను అరికట్టడం, వ్యక్తిగత గుర్తింపు వివరాల దుర్వినియోగాన్ని నివారించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే సుమారు 60 దేశాల్లోని వీసా దరఖాస్తుదారుల నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తోంది.
తాజాగా ఈ వ్యవస్థ పరిధిలోకి భారత్‌ను కూడా తీసుకువచ్చింది.
దరఖాస్తుదారుల నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని వర్తించే చట్టాల ప్రకారం గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అలాగే, ఎన్క్రిప్టెడ్ ఛానెళ్ల ద్వారా మాత్రమే ఈ సమాచారాన్ని సురక్షితంగా బదిలీ చేస్తామని వెల్లడించింది.
వివరాలు
బయోమెట్రిక్ తనిఖీలు ఎందుకు?
ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 26న లేదా ఆ తర్వాత భారతదేశంలో సమర్పించిన వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తాయి.
అంతకుముందు దరఖాస్తు చేసిన వారికి, ఇప్పటికే ఆస్ట్రేలియా వీసాలు పొందిన వారికి ఈ నిబంధనలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.