LOADING...
Sheikh Hasina: షేక్ హసీనా వార్తలపై ఆంక్షలు.. ప్రింట్, టీవీ, సోషల్ మీడియాకు బంగ్లాదేశ్ హెచ్చరిక
షేక్ హసీనా వార్తలపై ఆంక్షలు.. మీడియాకు ప్రభుత్వం తాజా ఆదేశాలు

Sheikh Hasina: షేక్ హసీనా వార్తలపై ఆంక్షలు.. ప్రింట్, టీవీ, సోషల్ మీడియాకు బంగ్లాదేశ్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన వార్తలు,ప్రకటనలు,ఇంటర్వ్యూలు,ప్రసంగాలు లేదా ఆమె వ్యాఖ్యలను ప్రచురించడం,ప్రసారం చేయడం నిలిపివేయాలని దేశంలోని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియా సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోషల్ మీడియా వేదికల్లో కూడా ఇలాంటి కంటెంట్‌ను ప్రచారం చేయొద్దని సూచించింది. ఈ నిర్ణయం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో భాగంగానే తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశంపై బంగ్లాదేశ్ సమాచార,ప్రసార శాఖ సలహాదారు డాక్టర్ జాహెద్ ఉర్ రహ్మాన్ స్పందించారు. కొంతమంది మీడియా సంస్థలు కోర్టు విధించిన ఆంక్షలను పూర్తిగా అమలు చేయడం లేదని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు.

వివరాలు 

రాయిటర్స్కు ఇంటర్వ్యూ ఇచ్చిన షేక్ హసీనా

అందుకే అన్ని మీడియా సంస్థలు న్యాయస్థానం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించినట్లు చెప్పారు. ఇటీవల షేక్ హసీనా అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూను బంగ్లాదేశ్‌లోని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. ఈ పరిణామం మరోసారి చర్చకు దారితీయగా, అనంతరం ప్రభుత్వం తాజా ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, 2024లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవిని కోల్పోయి దేశం విడిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె భారత్‌లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆమెపై బంగ్లాదేశ్‌లో పలు కేసులు నమోదై ఉండగా, ప్రభుత్వం ఆమెను "పరారీలో ఉన్న మాజీ ప్రధాని"గా పేర్కొంటోంది.

వివరాలు 

హసీనా కు సంబంధించిన వార్తల ప్రసారంపై ప్రభుత్వం తాజా ఆంక్షలు

అయితే, ఇటీవల షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి అధికారుల ఎదుట లొంగిపోతానని ప్రకటించారు. ఇదే సమయంలో ఆమెకు సంబంధించిన వార్తల ప్రసారంపై ప్రభుత్వం తాజా ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వాతంత్ర్యంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలను అమలు చేయడానికే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేస్తుండగా, విమర్శకులు మాత్రం ఈ నిర్ణయం మీడియా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Advertisement