LOADING...
Bangladesh: భారత్‌లో మ్యాచులు ఆడమన్న బంగ్లాదేశ్‌.. మ్యాచులు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి
భారత్‌లో మ్యాచులు ఆడమన్న బంగ్లాదేశ్‌.. మ్యాచులు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి

Bangladesh: భారత్‌లో మ్యాచులు ఆడమన్న బంగ్లాదేశ్‌.. మ్యాచులు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఊహించినట్లుగానే జరిగింది. భద్రతా కారణాలను ముందుకు తెస్తూ వచ్చే నెల భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనడాన్ని బంగ్లాదేశ్‌ తిరస్కరించింది. తమ జట్టు మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహించాలని ఐసీసీకి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధికారికంగా విజ్ఞప్తి చేసింది. భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలే ఈ నిర్ణయానికి కారణమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్యే బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ ఐపీఎల్‌ జట్టు నుంచి విడుదల చేసింది. దీని మరుసటి రోజే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కు పర్యటించమని బీసీబీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Details

మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలి

గత 24 గంటల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బోర్డు పరిస్థితిని సమీక్షించింది. బంగ్లాదేశ్ జట్టు భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సలహా మేరకు టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కు జట్టును పంపకూడదని నిర్ణయించామని బీసీబీ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచకప్‌లో మా మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరామని స్పష్టం చేసింది. ఇక ఒక బీసీబీ అధికారి మరింత ఘాటుగా స్పందించాడు. 'ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేమని భారత్‌ చెబుతోంది. అలాంటప్పుడు మొత్తం జట్టుకు భద్రత ఎలా కల్పిస్తుంది? మేం భారత్‌లో ఆడలేం. శ్రీలంకలోనే ఆడతామని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఐపీఎల్‌ వేలానికి ముస్తాఫిజుర్‌ను అందుబాటులో ఉంచాలని బీసీసీఐ కోరిందని గుర్తు చేసింది.

Details

భారత క్రికెట్‌ బోర్డుకు లేఖ రాసిన బీసీబీ

ఇప్పుడు అతడిని కేకేఆర్‌ నుంచి విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని భారత క్రికెట్‌ బోర్డుకు బీసీబీ లేఖ రాసింది. ఈ అంశంపై ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక స్పందన లేదు. గతేడాది బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పదవీచ్యుతురాలైన అనంతరం భారత్‌-బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలూ ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి.

Advertisement

Details

మ్యాచ్‌ల తరలింపుపై సవాల్

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ వచ్చే నెల 7న ప్రారంభం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌ లీగ్‌ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఫిబ్రవరి 17న ముంబయిలో నేపాల్‌తో ఆడాలి. టోర్నీ ప్రారంభానికి ఇంకా నెల రోజులే మిగిలి ఉండటంతో, ఈ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించడం అంత తేలికైన పని కాదని అధికారులు అంటున్నారు. షెడ్యూల్‌ మార్పు దాదాపు అసాధ్యం.

Advertisement

Details

హోటల్ బుకింగ్స్ ఇప్పటికే పూర్తి

ప్రత్యర్థి జట్ల విమాన టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌ ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రసార బృందానికి కూడా ఇది పెద్ద సవాలే. ఎవరో కోరారని వెంటనే మ్యాచ్‌లను మరో దేశానికి మార్చలేమని ఓ బోర్డు అధికారి వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో బీసీబీ విజ్ఞప్తికి ఐసీసీ అంగీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. గమనార్హంగా, భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తమ ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే ఆడనున్న విషయం తెలిసిందే.

Details

బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలు నిలిపివేత

తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై కూడా ప్రభావం పడింది. దేశంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారాలను సస్పెండ్‌ చేయాలని సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు ప్రభుత్వ సలహాదారు అసిఫ్‌ నజ్రుల్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు, ఆటగాళ్లకు, దేశానికి అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని ఆయన అన్నారు. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి విడుదల చేయడంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదని బీసీబీ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

Details

టీ20 ప్రపంచకప్‌కు బంగ్లా జట్టు ఇదే

ఈ వివాదాల మధ్యనే టీ20 ప్రపంచకప్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టును ప్రకటించింది. లిటన్‌ దాస్‌ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జాబితాను ఆదివారం వెల్లడించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరిన కొన్ని గంటల్లోనే జట్టును ఎంపిక చేయడం గమనార్హం. ఇటీవల ఐర్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. లిటన్‌ దాస్‌ (కెప్టెన్‌), సైఫ్‌ హసన్, తంజిద్‌ హసన్, పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమాన్, తౌహిద్‌ హృదోయ్, షమిమ్‌ హొస్సేన్, ఖాజి నురుల్‌ హసన్, మెహదీ హసన్, రిషాద్‌ హొస్సేన్ నసుమ్‌ అహ్మద్, ముస్తాఫిజుర్‌ రెహమాన్, తంజిమ్‌ హసన్‌ సకిబ్, తస్కిన్‌ అహ్మద్, సైఫుద్దీన్, షోరిఫుల్‌ ఇస్లామ్‌.

Advertisement