Obama: గ్రహాంతరవాసులపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రహాంతరవాసుల ఉనికి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఈ అంశంపై కాలక్రమేణా అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులు వంటి విషయాలకు అమెరికాలోని 'ఏరియా 51'కు గట్టి సంబంధం ఉందన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వంలో ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉందని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే, ఏలియన్స్‌ను ఏరియా 51లో అమెరికా నిర్బంధించిందన్న ఊహాగానాల్లో మాత్రం ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ తరహా వాదనలకు ఆధారాలు లేవని కూడా తెలిపారు.
వివరాలు
గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన రికార్డులు..
దశాబ్దం క్రితం అమెరికా వైమానిక దళానికి చెందిన రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్‌లలో మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై అసాధారణ జీవుల ఉనికి కనిపించిందని పలు నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో ఒబామా స్పందించారు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన రికార్డులు అమెరికా ప్రభుత్వ వద్ద ఉన్నాయన్న సమాచారమే తన పాలనా కాలంలో కూడా తనకు అందలేదని చెప్పారు.
వివరాలు
ఏమిటీ ఏరియా 51?
అమెరికాలోని నెవాడ రాష్ట్రంలో ఉన్న ఏరియా 51 ఒక అత్యంత రహస్య సైనిక స్థావరం. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు ఆయుధాలతో పాటు వివిధ ఆధునిక సాంకేతిక పరికరాలపై పరీక్షలు నిర్వహిస్తుంటారు. సైనిక శిక్షణ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడ ఎడారిలో సుమారు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. గతంలో ఇక్కడ లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ రూపొందించిన యూ-2 నిఘా విమానాల పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత పలు రహస్య ఫైటర్ జెట్ల పనితీరును కూడా ఇక్కడే పరిశీలించారు. ఒక దశలో ఈ ప్రాంతంపై ఉపగ్రహ చిత్రాలు తీయడాన్ని నిషేధించారు. అయితే, ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.