LOADING...
Bluetooth name: బ్లూటూత్ పేరు దెబ్బకు ఎమర్జెన్సీ.. స్పెయిన్ వెళ్తున్న విమానం యూటర్న్
బ్లూటూత్ పేరు దెబ్బకు ఎమర్జెన్సీ.. స్పెయిన్ వెళ్తున్న విమానం యూటర్న్

Bluetooth name: బ్లూటూత్ పేరు దెబ్బకు ఎమర్జెన్సీ.. స్పెయిన్ వెళ్తున్న విమానం యూటర్న్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ బ్లూటూత్ డివైజ్‌కు పెట్టిన పేరు విమాన సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరిస్థితి అంతగా ఉద్రిక్తంగా మారడంతో విమానంలో ఎమర్జెన్సీ ప్రకటించి, గాల్లో ఉన్న విమానాన్ని తిరిగి బయల్దేరిన విమానాశ్రయానికే మళ్లించాల్సి వచ్చింది. దీంతో స్పెయిన్‌కు వెళ్లాల్సిన విమానం అమెరికాలోనే తిరిగి ల్యాండ్ అయింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయం నుంచి స్పెయిన్‌కు బయల్దేరింది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే సిబ్బంది బ్లూటూత్ నెట్‌వర్క్‌లను పరిశీలిస్తుండగా, ఒక డివైజ్ పేరు 'బాంబ్'గా కనిపించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరూ తమ మొబైల్ ఫోన్లలోని బ్లూటూత్ కనెక్షన్లను నిలిపివేయాలని పలుమార్లు సూచించారు.

వివరాలు 

నెవార్క్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసిన విమానం 

అయితే అన్ని డివైజ్‌లు ఆఫ్ అయినప్పటికీ,'బాంబ్' పేరుతో ఉన్న బ్లూటూత్ మాత్రం నిరంతరం యాక్టివ్‌గా కనిపించింది. దాదాపు రెండు గంటల పాటు పరిస్థితిని గమనించిన సిబ్బంది గ్రౌండ్ కంట్రోల్‌తో సంప్రదించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి నెవార్క్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పేర్లతో వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు కలకలం రేపడం ఇది తొలిసారి కాదు. ఇటీవల యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానంలో 'Free Palestine,F Zionists' పేరుతో ఉన్న వైఫై హాట్‌స్పాట్‌ను సిబ్బంది గుర్తించారు.

వివరాలు 

టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో కూడా 'బాంబ్'

అలాగే మరో సందర్భంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో కూడా 'బాంబ్' పేరుతో ఉన్న నెట్‌వర్క్ కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనల్లో ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదు. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విమానయాన సంస్థలు ఇలాంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా కఠినంగా పరిగణిస్తాయి. తాజా ఘటనలో 'బాంబ్' పేరుతో కనిపించిన బ్లూటూత్ డివైజ్ ఓ 16 ఏళ్ల బాలుడి స్మార్ట్‌వాచ్‌కు చెందినదిగా ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

Advertisement