Bangladesh: ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో హింస.. బీఎన్‌పీ నేత అజీజుర్ ముసబ్బిర్‌పై కాల్పులు,మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ నేతపై జరిగిన కాల్పుల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన అజీజుర్ ముసబ్బిర్ మృతి చెందాడు. పోలీసుల సమాచారం ప్రకారం, అజీజుర్ ముసబ్బిర్ గతంలో బీఎన్‌పీ అనుబంధ సంస్థ అయిన ఢాకా మెట్రోపాలిటన్ నార్త్ స్వచ్ఛసేవక్ దళ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాడు. ఢాకాలోని కర్వాన్ బజార్ ప్రాంతంలో ఒక హోటల్ సమీపంలో ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు అతిదగ్గర నుంచి అజీజుర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
వివరాలు
దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తత
తీవ్ర గాయాలపాలైన అజీజుర్‌ను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో వ్యక్తికీ గాయాలు కాగా, అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని వెల్లడించారు. ఈ తాజా కాల్పుల ఘటనతో దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. అజీజుర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఎన్‌పీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు భద్రతాధికారులు నిరసనకారులను చెదరగొట్టేందుకు చర్యలు తీసుకున్నారు.