Indian Citizen: ఆంటారియోలో వేధింపుల కలకలం: 51ఏళ్ల ఇండియన్‌కు డిపోర్ట్ ఆర్డర్
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను వేధించిన కేసులో 51 సంవత్సరాల భారతీయుడికి అక్కడి కోర్టు దోషి తీర్పు ఇచ్చింది. వెంటనే దేశం విడిచిపోవాలని, ఇకముందు కెనడాలోకి తిరిగి ప్రవేశించేందుకు అనుమతి ఉండదని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే... జగ్జీత్ సింగ్ అనే వ్యక్తి ఆరు నెలల టూరిస్ట్ వీసాతో ఈ ఏడాది జూలైలో ఒంటారియోకు చేరుకున్నాడు. అక్కడ కొత్తగా పుట్టిన తన మనవడిని చూడటానికి వెళ్లిన అతడు, కొద్ది రోజుల్లోనే స్థానికంగా తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకున్నాడు. సార్నియా ప్రాంతంలోని ఒక హైస్కూల్ బయట ఉన్న స్మోకింగ్ ఏరియాకు తరచూ వెళ్లి, అక్కడి విద్యార్థినుల్ని ఇబ్బందులకు గురి చేశాడని తేలింది.
వివరాలు
సెప్టెంబర్ 16న అరెస్ట్
కెనడియన్ మీడియా కథనాల ప్రకారం, సెప్టెంబర్ 8 నుంచి 11 మధ్య జగ్జీత్ సింగ్ పలుమార్లు స్కూల్ విద్యార్థినులను సమీపించి, వారితో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించాడు డ్రగ్స్, మద్యం వంటి విషయాలు చెప్పడంతో పాటు,ఒక విద్యార్థిని భుజంపై చేయి వేసేందుకు కూడా ప్రయత్నించాడు. భయపడిన ఆ అమ్మాయిల బృందం వెంటనే పోలీసులను సంప్రదించింది. అదీకాకుండా,అతనికి ఇంగ్లీష్ వచ్చేదిలేదని,స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న అమ్మాయిలను వెంబడించే అలవాటు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. తరువాత సెప్టెంబర్ 16న పోలీసులు అతనిని అరెస్ట్ చేసి లైంగిక వేధింపుల కేసు పెట్టారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా మరో ఫిర్యాదు రావడంతో మళ్లీ అతడికి కటకటాలే ఎదురయ్యాయి. చివరికి సెప్టెంబర్ 19న కోర్టులో ఆయన తన తప్పును అంగీకరించాడు.
వివరాలు
దేశం విడిచి వెళ్లాలని ఆదేశం.. తిరిగి రాకుండా నిషేధం
విచారణలో న్యాయమూర్తి క్రిస్టా లిన్ లెస్జిన్స్కీ కఠినంగా స్పందిస్తూ— "హైస్కూల్ ఆవరణకు వెళ్లాల్సిన అవసరం అతనికి లేదు. ఇలాంటి ప్రవర్తనను పూర్తిగా సహించం" అని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 30న భారత్‌కు తిరుగు ప్రయాణ టికెట్ ఉందని న్యాయవాది చెప్పినా, న్యాయమూర్తి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అంతేకాకుండా బాధితులతో మాట్లాడకుండా, వారుండే ప్రాంతాలకు వెళ్లకుండా మూడేళ్ల పాటు ప్రొబేషన్ విధించారు.