China: కొవిడ్ తరహా లక్షణాలతో.. చైనాలో కొత్త వైరస్ కలకలం.. భారీ సంఖ్యలో ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనం
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో కరోనా మహమ్మారి అనంతరం మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.
హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ వైరస్ బారినపడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రులకు చేరుతున్నారని సమాచారం.
హెచ్‌ఎంపీవీతో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వంటి వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కొందరు యూజర్లు పేర్కొన్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ లేదు.
ఈ కొత్త వైరస్ బాధితుల్లో కొవిడ్‌కు సమానమైన లక్షణాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు ఈ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
అంటువ్యాధుల బాధితుల సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం
అంతర్జాతీయ వార్తా సంస్థ ఒక నివేదిక ప్రకారం, చైనాలో గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనడానికి చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ప్రత్యేక పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించింది.
ఇదే సమయంలో, కొవిడ్-19 వ్యాప్తి మొదటిరోజుల్లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
వైరస్ మూలాలను గుర్తించేందుకు, అవసరమైన సూచనలు చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికార మీడియా 'సీసీటీవీ' పేర్కొంది.
డిసెంబరు 16 నుంచి 22 మధ్య అంటువ్యాధుల బాధితుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఈ సమాచారం స్పష్టం చేస్తోంది.