Three Gorges Dam Of Space: అంతులేని సౌరశక్తి కోసం.. అంతరిక్షంలో చైనా 'త్రీ గోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్'!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. తాజా ప్రాజెక్ట్ దిశగా చైనా కొత్త అడుగులు వేస్తోంది.
సౌరశక్తిని సమర్థవంతంగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.శాస్త్రవేత్తలు దీన్ని 'త్రీగోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్' (Three Gorges Dam Of Space)గా అభివర్ణిస్తున్నారు.
చైనాకు చెందిన 'త్రీగోర్జెస్ డ్యామ్' (Three Gorges Dam) ఒక గొప్ప సృష్టి.ఇది మానవ చరిత్రలో నిర్మించబడిన అతిపెద్ద నీటి నిల్వ కేంద్రం.
ఇప్పుడు అదే రకంగా సౌరశక్తిని ఒడిసిపట్టేలా బీజింగ్ ప్లాన్ చేస్తోంది.
వివరాలు
భూమికి 32,000కిలోమీటర్ల ఎత్తులో,భూస్థిర కక్ష్యలో..
ఆ దేశానికి చెందినప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త లాంగ్‌లెహావోను ఉటంకిస్తూ ఈ సరికొత్త సోలార్ ప్రాజెక్ట్‌ను గురించి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భూమికి 32,000కిలోమీటర్ల ఎత్తులో,భూస్థిర కక్ష్యలో ఒక కిలోమీటర్ వెడల్పుతో భారీ సౌరశ్రేణిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
దీని ద్వారా భూమి వాతావరణంలో మార్పులు,రాత్రిపగలు తేడా లేకుండా ఎప్పటికప్పుడు సౌరశక్తిని సేకరించవచ్చు.
లాంగ్‌లెహావో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ,''ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై మేము పని చేస్తున్నాము. దీనిని భూస్థిర కక్ష్యలోకి తరలించడం చాలా కీలకం.ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్.ఈ విధానంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే శక్తి భూమి లోపల తవ్వి పొందే మొత్తం చమురు నిల్వలలో ఉత్పత్తయ్యే శక్తితో సమానంగా ఉంటుంది''అని చెప్పారు.
వివరాలు
అంతరిక్షం నుండి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఇది ఒకటి
ఈ ప్రాజెక్ట్‌ను త్రీగోర్జెస్ డ్యామ్‌తో పోల్చడం జరిగింది. చైనాలోని యాంగ్జే నదిపై ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్తు కేంద్రం.
అంతరిక్షం నుండి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఇది ఒకటి.
ఈ డ్యామ్‌లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లతో, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మూడు అణువిద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి సమానం.
గతంలో నాసా పేర్కొన్న ప్రకారం, ఈ డ్యామ్‌లో నీటినిల్వ బరువుకు భూపరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గింది.
వివరాలు
బ్రహ్మపుత్ర నదిపై, ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్
ఇక టిబెట్‌లో భారత సరిహద్దుకు సమీపంలో యార్లంగ్ జంగ్బోగా ప్రసిద్ధమైన బ్రహ్మపుత్ర నదిపై, ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మించేందుకు చైనా ఇటీవలే ఆమోదముద్ర వేసింది.
ఈ ప్రాజెక్టు బ్రహ్మపుత్రనది ప్రవేశించే ప్రాంతంలో నిర్మించాలనే యోచనతో, చైనా 137 బిలియన్ డాలర్లతో ఈ భారీ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
ఈ ప్రాజెక్టు సాయంతో చైనా బ్రహ్మపుత్ర నదిలో జల ప్రవాహాన్ని నియంత్రించగలుగుతుంది.
అయితే, భారీ మోతాదులో వరద నీటిని భారత భూభాగంలోకి విడుదల చేయడం, విధ్వంసం సృష్టించవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.