Loading...
Cyberattack: రష్యా అత్యవసర యాప్‌లో అణు దాడి అలర్ట్.. సైబర్ దాడితో కలకలం
రష్యా అత్యవసర యాప్‌లో అణు దాడి అలర్ట్.. సైబర్ దాడితో కలకలం

Cyberattack: రష్యా అత్యవసర యాప్‌లో అణు దాడి అలర్ట్.. సైబర్ దాడితో కలకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖకు చెందిన మొబైల్ యాప్‌పై సైబర్ దాడి జరిగింది. ఈ యాప్ ద్వారా ప్రజలకు తప్పుడు అణు దాడి హెచ్చరికలు పంపడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశాల నుంచి డ్రోన్ల దాడులు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ యాప్‌ను ఉపయోగిస్తారు. అయితే సైబర్ నేరగాళ్లు యాప్‌లోకి చొరబడి తప్పుడు సమాచారాన్ని పంపినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ కూడా తమ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడి జరిగినట్లు ప్రకటించింది. ఖేర్సన్ ప్రాంతంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

వివరాలు 

మొబైల్ అప్లికేషన్‌పై భారీ సైబర్ దాడి

రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖకు చెందిన మొబైల్ అప్లికేషన్‌పై భారీ సైబర్ దాడి జరిగినట్లు అధికారులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ దాడికి పాల్పడినవారు ప్రజలకు తప్పుడు సమాచారం పంపుతున్నారని తెలిపారు.

ఉక్రెయిన్ వైమానిక దళం, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునే కేంద్రం కూడా తమ అలర్ట్ వ్యవస్థలపై సైబర్ దాడి జరిగినట్లు ప్రకటించాయి.

ఈ ఘటనల్లో తప్పుడు అణు దాడి హెచ్చరికలు వెలువడటం అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారింది.

వివరాలు 

అణు దాడి హెచ్చరికలు.. గతంలోనూ పొరపాట్లు

అణు దాడులకు దారితీసే తప్పుడు హెచ్చరికలు గతంలోనూ వెలువడ్డాయి.

1983లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

అమెరికా ఒక ఖండాంతర క్షిపణిని,ఆ తర్వాత మరో నాలుగు క్షిపణులను ప్రయోగించినట్లు సోవియట్ యూనియన్‌కు చెందిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థ సమాచారం ఇచ్చింది.

ఆ సమయంలో సోవియట్ యూనియన్ అణు హెచ్చరికల కమాండ్ సెంటర్‌లో డ్యూటీ అధికారిగా ఉన్న స్టానిస్లావ్ పెట్రోవ్ ఈ సమాచారంపై అనుమానం వ్యక్తం చేశారు.

హెచ్చరికల వ్యవస్థలో సాంకేతిక లోపం ఉండవచ్చని గుర్తించి,ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు.

ఆయన ఆ హెచ్చరికలను నిజమని భావించి ఉంటే పరిస్థితి అదుపుతప్పి పూర్తిస్థాయి అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండేదని అప్పట్లో పలువురు అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా కమాండ్ సెంటర్ పొరపాటు వల్ల ఇలాంటి హెచ్చరికలు

తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన సాంకేతిక లోపమే ఆ తప్పుడు హెచ్చరికలకు కారణమని నిర్ధారించారు.

అంతకుముందు కూడా అమెరికా కమాండ్ సెంటర్ కంప్యూటర్లలో తలెత్తిన పొరపాటు వల్ల ఇలాంటి హెచ్చరికలు వెలువడ్డాయి.

సోవియట్ యూనియన్ అణు దాడికి సిద్ధమవుతోందనే సమాచారం రావడంతో అమెరికా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.

అయితే హెచ్చరికల వ్యవస్థలోని లోపాన్ని గుర్తించిన తర్వాత వాటిని వెనక్కి పిలిచింది.

ఈ ఘటనలు అణు హెచ్చరికల వ్యవస్థల్లో సాంకేతిక లోపాలు, సైబర్ దాడులు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీయవచ్చో స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT