Loading...
US Military: అమెరికా సైనిక స్థావరాల్లో ఆహార కొరత.. ఫ్రీజర్లపై సైబర్‌ దాడి అనుమానాలు
అమెరికా సైనిక స్థావరాల్లో ఆహార కొరత.. ఫ్రీజర్లపై సైబర్‌ దాడి అనుమానాలు

US Military: అమెరికా సైనిక స్థావరాల్లో ఆహార కొరత.. ఫ్రీజర్లపై సైబర్‌ దాడి అనుమానాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు ఒక్కసారిగా పనిచేయకపోవడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా 12కిపైగా సైనిక స్థావరాల్లో ఆహార నిల్వలు పాడైపోవడంతో సైనికులకు ఆహార కొరత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనల వెనుక సైబర్‌ దాడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఫ్రీజర్లను లక్ష్యంగా చేసుకుని సైనికులను ఆహార కొరతలోకి నెట్టేందుకు కుట్ర జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

వివరాలు 

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు ఎందుకు పనిచేయలేదు?

ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని పలు సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయి.

చల్లబడాల్సిన ఫ్రీజర్లు వేడెక్కడం ప్రారంభించాయి. కొన్ని చోట్ల రాత్రికి రాత్రే కూలింగ్ యూనిట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

దీంతో వాటిలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఉదయానికల్లా పాడైపోయాయి. ఈ ఘటనలతో దేశవ్యాప్తంగా 12కుపైగా సైనిక స్థావరాలు ప్రభావితమయ్యాయి.

ఆయా స్థావరాల్లోని సైనికులు ఆహార కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒకేసారి ఇన్ని సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు పనిచేయకపోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనల వెనుక సైబర్‌ నేరగాళ్ల హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. ఫ్రీజర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడికి పాల్పడి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

వివరాలు 

ఫ్రాన్స్‌లోనూ ఇదే తరహా ఘటన

అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లోని సూపర్‌ మార్కెట్లలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

అక్కడి రిఫ్రిజిరేటర్‌ వ్యవస్థల్లోకి సైబర్‌ హ్యాకర్లు చొరబడి, ఉష్ణోగ్రతలను పెంచడంతో ఆహార పదార్థాలు పాడయ్యాయి.

ఈ సైబర్‌ దాడిని ఫ్రాన్స్‌ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.

ఈ నేపథ్యంలో అమెరికా సైనిక స్థావరాల్లో జరిగిన ఘటనలకు, ఫ్రాన్స్‌లోని సూపర్‌ మార్కెట్లపై జరిగిన దాడికి సంబంధం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

దీంతో అమెరికా రక్షణ శాఖ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై ఫ్రాన్స్‌ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

దర్యాప్తులో పలు ఏజెన్సీలు

ఈఘటనపై జరుగుతున్న దర్యాప్తులో అమెరికా సైబర్‌ కమాండ్‌కు చెందిన ఒక యూనిట్‌, ఆర్మీ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌కు చెందిన సైబర్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌తో పాటు పలు దర్యాప్తు సంస్థలు పాల్గొన్నాయి.

ఫ్రీజర్ల వ్యవస్థల్లోకి ఎవరైనా అనధికారికంగా చొరబడ్డారా?సాంకేతిక సమస్యలే కారణమా?అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

అయితే అమెరికా,ఫ్రాన్స్‌లలో జరిగిన సైబర్‌ దాడుల మధ్య సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

అయినప్పటికీ రెండునెలల వ్యవధిలోనే ఒకే తరహా సౌకర్యాలు,ఒకే విధమైన సమస్యలను ఎదుర్కోవడం అనుమానాలకు తావిస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఈఘటనల వెనుక శత్రుదేశాల కుట్ర లేదా ఇతర రాజకీయ కారణాలు ఉండే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.

దర్యాప్తు పూర్తయితేనే ఈ ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT