Elon Musk: డీప్‌ఫేక్ దెబ్బకు బ్రేక్.. గ్రోక్‌పై తాత్కాలిక నిషేధం.. ఎలాన్ మస్క్ కు భారీ షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన xAIసంస్థ రూపొందించిన ప్రముఖ AI చాట్‌బాట్ గ్రోక్ (Grok) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. గ్రోక్ ద్వారా నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ చిత్రాలు సృష్టించబడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇండోనేషియా, మలేషియా దేశాలు దీనిపై తాత్కాలిక నిషేధం విధించాయి. మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని అనుమతి లేకుండా అశ్లీల డీప్‌ఫేక్ కంటెంట్ రూపొందిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో ఈ రెండు దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలకు దిగాయి. గ్రోక్ టెక్నాలజీ డిజిటల్ ప్రపంచంలో కొత్త ముప్పుగా మారుతోందని ఇండోనేషియా, మలేషియా ప్రభుత్వాలు అభిప్రాయపడ్డాయి. ఇదే అంశంపై ఇటీవల భారత ప్రభుత్వం కూడా గ్రోక్ ద్వారా అభ్యంతరకరమైన కంటెంట్ వ్యాప్తి చెందుతున్నందుకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Details
చిక్కుల్లో గ్రోక్..
గ్రోక్ AIను ఉపయోగించి నకిలీ, అశ్లీల కంటెంట్ సృష్టించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మలేషియా కమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియా కమిషన్ (MCMC) వెల్లడించింది. గ్రోక్ ద్వారా తయారవుతున్న ఈ డీప్‌ఫేక్ కంటెంట్ సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా రూపొందించబడుతోందని, ఇది వారి గౌరవం, భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొంది. ఇలాంటి AI సాంకేతికత సమాజానికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జనవరి 3 మరియు 8 తేదీల్లో X, xAI సంస్థలకు నోటీసులు పంపినట్లు మలేషియా ప్రభుత్వం తెలిపింది.
Details
సమస్యకు పరిష్కారం చూపలేదు
ప్రభావవంతమైన సాంకేతిక భద్రతా చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, కంపెనీలు కేవలం యూజర్ రిపోర్టింగ్ సిస్టమ్‌పై మాత్రమే దృష్టి పెట్టాయని, అసలు సమస్యకు సరైన పరిష్కారాలు చూపలేదని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో గ్రోక్‌ను మలేషియాలో తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Details
ఇండోనేషియా స్పందన..
గ్రోక్ ద్వారా సృష్టించబడుతున్న నకిలీ, అశ్లీల కంటెంట్ మహిళలు, పిల్లలకు తీవ్ర స్థాయిలో హాని కలిగించే ప్రమాదం ఉందని ఇండోనేషియా కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ మంత్రి ముత్యా హఫీద్ తెలిపారు. ఇది మానవ హక్కులు, డిజిటల్ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఉల్లంఘనగా ఆమె అభివర్ణించారు. గ్రోక్ వల్ల ఇండోనేషియా పౌరుల గౌరవం, భద్రతకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇండోనేషియాలో కూడా గ్రోక్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ, ఈ ఫీచర్‌కు సంబంధించి X సంస్థ నుంచి వెంటనే వివరణ కోరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Details
ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం
నిజానికి గ్రోక్ వంటి AI సాధనాల ద్వారా రూపొందించే నకిలీ ఫోటోలు, వీడియోలు వాస్తవికంగా కనిపించడం వల్ల ప్రజల గుర్తింపు, ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే భారతదేశం, యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఇప్పటికే ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశాయి. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగానికి గురికాకుండా ఉండేందుకు AI కంపెనీలు కఠినమైన భద్రతా రక్షణలను అమలు చేయాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా దేశాలు xAIకి చెందిన గ్రోక్‌ను తాత్కాలికంగా నిషేధించిన పరిస్థితిలో దీనిపై కంపెనీ లేదా ఎలాన్ మస్క్ ఎలా స్పందిస్తారన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.