
Earthquake: పసిఫిక్ ద్వీప దేశం వనాటులో 7.3 తీవ్రతతో భూకంపం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు దేశంలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం, దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలా నుండి పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో కేంద్రాన్ని కలిగి ఉంది.
భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో పలుమార్లు ప్రకంపనలు నమోదయ్యాయి.
ఈ విపత్తు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు, మరికొన్ని సెకన్లపాటు గడిచేలోపే భూమి గట్టిగా కంపించింది.
వివరాలు
దెబ్బతిన్న అమెరికా, ఫ్రాన్స్ దేశాల ఎంబసీలు
భూకంప ప్రభావంతో పలు భవనాలు నేలకూలాయి, ముఖ్యంగా పోర్ట్ విలాలో ఉన్న పలు దేశాల రాయబార కార్యాలయ భవనం భారీగా ధ్వంసమైంది.
ఈ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల ఎంబసీలు ఉన్నాయి, అయితే పై అంతస్తులు కూలిపోవడం వల్ల ఈ కార్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ పరిణామాల కారణంగా ఆయా ఎంబసీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
భూకంపం వల్ల ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, మొత్తం నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రజలు భయంతో పరిగెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్
ప్రభుత్వ వెబ్‌సైట్లు పనిచేయకపోవడం, పోలీసు స్టేషన్లు,ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఫోన్లు సమర్థంగా కనెక్ట్ అవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
భూకంప సమయంలో ప్రజలు భయంతో పరిగెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
వనౌటు దేశం 80 చిన్న చిన్న దీవుల సముదాయంగా ఉండి, 3.30 లక్షల మంది జనాభాతో రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఉంది.
ఈ కారణంగా అక్కడ తరచుగా ప్రకంపనలు సంభవిస్తుంటాయి. తాజా భూకంపం తరువాత తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొద్దిసేపటి తరువాత వాటిని వెనక్కి తీసుకున్నారు.