Estonia Defence Minister : రూ.769 కోట్ల ఆయుధ ఒప్పందంలో వివాదం.. ఎస్టోనియా రక్షణ మంత్రి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సంస్థతో కుదుర్చుకున్న రూ.769 కోట్లకు పైగా విలువైన ఆయుధాల కొనుగోలు ఒప్పందం వివాదాస్పదం కావడంతో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్‌కుర్ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందించేందుకు చేపట్టిన ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికితోడు దేశ జాతీయ ఆడిట్ కార్యాలయం చేసిన కీలక వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. 2022 నుంచి రక్షణ మంత్రిగా కొనసాగుతున్న పెవ్‌కుర్.. ఒప్పందం విఫలమైనందుకు నైతిక, రాజకీయ బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
వివరాలు
2024లో మొదలైన వివాదం
''ఎస్టోనియా భద్రత అనేది ఒక్క వ్యక్తి బాధ్యత కాదు. అది మనందరి ఉమ్మడి బాధ్యత. అందుకే రక్షణ రంగానికి సంబంధించి రాజకీయ బాధ్యతను స్వీకరిస్తూ.. తగిన సమయంలో రక్షణ మంత్రి బాధ్యతలను ప్రధానమంత్రికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను''అని పెవ్‌కుర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ ఆయుధ ఒప్పందంపై వివాదం 2024లోనే మొదలైంది.
ఎస్టోనియా సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ (RKIK).. ఇటలీలో నమోదైన డేటాసెల్ ఎస్‌ఆర్‌ఎల్ (Datasel SRL) అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది.
ఆ తర్వాత ఈ కంపెనీ భారతీయ సంస్థ 'నెకో డిఫెన్స్ మ్యునిషన్స్' ఆధీనంలోకి వెళ్లింది.
ఆర్టిలరీ షెల్స్‌ను గతంలో విక్రయించిన అనుభవం పెద్దగా లేని డేటాసెల్‌కు ఉక్రెయిన్ కోసం అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేసే బాధ్యతను అప్పగించారు.
వివరాలు
ఒప్పందంలో భాగంగా ముందస్తుగా 70 మిలియన్ యూరోలు
ఎస్టోనియా ప్రభుత్వ టెలివిజన్ ERRతో పాటు 'ఈస్తీ ఎక్స్‌ప్రెస్', 'పోస్టీమీస్' నివేదికల ప్రకారం.. ఈ ఆయుధాల కొనుగోలు కోసం యూరోపియన్ యూనియన్ నిధులను ఉపయోగించారు.
ఒప్పందంలో భాగంగా కంపెనీకి సుమారు 70 మిలియన్ యూరోలు ముందస్తుగా చెల్లించారు.
కొన్ని నెలల్లోనే ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరాల్సి ఉండగా.. ఉత్పత్తి సంబంధిత సమస్యల కారణంగా సరఫరా ఆలస్యమైంది.
చివరకు 2025లో అందిన ఆయుధాలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు సరిపోలలేదని 'ఈస్తీ ఎక్స్‌ప్రెస్' నివేదించింది.
వివరాలు
ఒప్పందం రద్దుపై కంపెనీ అభ్యంతరం
ఎస్టోనియా ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసే సమయానికి తాము 59 మిలియన్ యూరోల విలువైన ఆయుధాలను ఇప్పటికే సరఫరా చేశామని డేటాసెల్ పేర్కొన్నట్లు 'ఈస్తీ ఎక్స్‌ప్రెస్' తెలిపింది.
అయితే ఒప్పందాల రద్దును కంపెనీ సవాల్ చేయడంతో వివాదం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు చేరింది.
ఎస్టోనియా ప్రభుత్వంపై డేటాసెల్ దావా వేసింది. ''ఈ సరఫరా ఒప్పందాల కారణంగా డేటాసెల్ తీవ్రంగా నష్టపోయింది.
కాంట్రాక్టులను ఆకస్మికంగా రద్దు చేయడానికి ఎస్టోనియన్ సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ చెప్పిన కారణాలు ఒకదానికొకటి విరుద్ధంగా, అసంగతంగా ఉన్నాయి'' అని కంపెనీ తరఫు న్యాయవాది ఆరోపించారు.
వివరాలు
ఒప్పందం రద్దుపై కంపెనీ అభ్యంతరం
RKIK నుంచి 59 మిలియన్ యూరోలు ముందస్తు చెల్లింపుగా అందుకున్న విషయాన్ని డేటాసెల్ ధ్రువీకరించింది.
అయితే మిగిలిన నిధులకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు సంస్థ నిరాకరించింది.
సరఫరాలో కొంత ఆలస్యం జరిగిన విషయాన్ని అంగీకరించినప్పటికీ.. ఆయుధాల నాణ్యత తక్కువగా ఉందన్న ఆరోపణలను మాత్రం కంపెనీ ఖండించింది.
RKIK తన ఒప్పందపరమైన నిబంధనలను నెరవేర్చినట్లయితే మిగిలిన కాంట్రాక్టును పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
వివరాలు
ముందస్తు నిధుల రికవరీకి ప్రయత్నాలు
డేటాసెల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను RKIK రద్దు చేయడంతోపాటు.. ఇప్పటికే చెల్లించిన ముందస్తు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది.
రద్దు చేసిన ఒప్పందాలకు సంబంధించిన సుమారు 70 మిలియన్ డాలర్ల నిధులను తిరిగి పొందేందుకు ఎస్టోనియా యూరోపియన్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది.
సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ జనరల్ ఎల్మార్ వాహెర్ ఈ వ్యవహారంపై స్పందించారు.
గతంలో తగిన అనుభవం లేని కంపెనీతో ఒప్పందం చేసుకోవడమే ప్రధాన తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇల్లు నిర్మించే అనుభవం లేని కంపెనీకి నిర్మాణ పనులు అప్పగిస్తే.. ఆ పని పూర్తవుతుందా అనే సందేహం సహజంగానే ఉంటుందని ఉదాహరణగా చెప్పారు.
వివరాలు
ఆడిట్ కార్యాలయం ఆందోళన
మరోవైపు రక్షణ రంగ నిధుల నిర్వహణ, సైనిక పరికరాల కొనుగోళ్ల తీరుపై ఎస్టోనియా నేషనల్ ఆడిట్ ఆఫీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
యూరోపియన్ యూనియన్ నుంచి ఇప్పటికే ఖర్చు చేసిన నిధులను తిరిగి రాబట్టలేకపోతే.. సుమారు 70 మిలియన్ డాలర్ల భారాన్ని ఎస్టోనియా ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుందని హెచ్చరించింది.
అయితే ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యక్ష చర్చల్లో తాను పాల్గొనలేదని రక్షణ మంత్రి పెవ్‌కుర్ స్పష్టం చేశారు.
అయినప్పటికీ ఈ వ్యవహారంలో రాజకీయ బాధ్యత తనపై ఉందని భావించి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్రధాని మిచల్ స్పందన
రక్షణ మంత్రి రాజీనామాపై ఎస్టోనియా ప్రధాని క్రిస్టెన్ మిచల్ స్పందించారు.
ఈ వ్యవహారంలో పెవ్‌కుర్ వ్యక్తిగతంగా తప్పు చేయలేదని, అయినప్పటికీ రాజకీయ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఎస్టోనియా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచిందని మిచల్ తెలిపారు.
ఉక్రెయిన్‌కు మద్దతు అందించడం ద్వారా ఆ దేశ భద్రతకు మాత్రమే కాకుండా.. ఎస్టోనియా సొంత భద్రతను కూడా మరింత బలోపేతం చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.