Austrian Airlines: టెల్‌అవీవ్-వియన్నా విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
బాంబు బెదిరింపు కారణంగా ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం బల్గేరియా రాజధాని సోఫియాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. రొమేనియా సరిహద్దులకు సమీపంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో సిబ్బందికి బాంబు బెదిరింపు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన వారు విమానాన్ని సోఫియా వైపు మళ్లించారు. విమానం అక్కడికి చేరుకుని దిగే వరకు బల్గేరియా వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం దానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే అందులో ఉన్న 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహించారు.
వివరాలు
విమానంలో ఇజ్రాయెల్‌కు చెందిన యువ ప్రతినిధుల బృందం
గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
విమానంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నట్లు పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో ప్రసంగించేందుకు వెళ్తున్న ఇజ్రాయెల్‌కు చెందిన యువ ప్రతినిధుల బృందం కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు తెలిపింది.
అయితే, బాంబు బెదిరింపునకు సంబంధించిన పూర్తి వివరాలను ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు.
ఫ్లై దుబాయ్ విమానంలో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తిన కొన్ని వారాల వ్యవధిలోనే తాజాగా మరో విమానానికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం.