flydubai co-pilot : గాజాపై ప్రతీకారంతోనే ఫ్లైదుబాయ్ విమానం హైజాక్‌కు యత్నం.. కోపైలట్
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఒమన్‌కు చెందిన కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ.. తన చర్యకు గల కారణాన్ని దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. గాజాలో జరుగుతున్న పరిణామాలకు ప్రతీకారంగానే తాను ఈ చర్యకు పాల్పడినట్లు అతడు చెప్పినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థ 'మాకో' కథనం పేర్కొంది. "గాజాలో జరుగుతున్న పరిణామాలకు ప్రతీకారంగానే ఇలా చేశాను. అమరుడిగా చనిపోవాలనుకున్నాను" అని హమ్మామీ దర్యాప్తులో చెప్పినట్లు మాకో తెలిపింది. అయితే, ఈ వాంగ్మూలానికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు.
వివరాలు
గతంలోనూ తీవ్రవాద భావజాలంపై ఆరోపణలు
హమ్మామీ గతంలో ఒమన్ జాతీయ విమానయాన సంస్థలో పనిచేసినట్లు సమాచారం.
తీవ్రవాద భావజాలానికి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో గతేడాది అతడిని ఆ సంస్థ నుంచి తొలగించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి.
ఆ తర్వాత అతడి పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించినప్పుడు.. ఇజ్రాయెల్ విమానాలకు సంబంధించిన కాక్‌పిట్ వీడియోలు, అల్‌ఖైదా నేతలకు సంబంధించిన పోస్టులు కనిపించినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది.
హమ్మామీ తీవ్రవాద భావజాల ప్రభావానికి లోనై ఉండొచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
వివరాలు
ల్యాండింగ్‌కు ముందు కెప్టెన్‌పై దాడి
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ 1073 విమానం దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
విమానం ల్యాండింగ్‌కు సుమారు గంట సమయం మాత్రమే ఉన్న సమయంలో కోపైలట్ హమ్మామీ.. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై దాడి చేసినట్లు సమాచారం.
దాడి సమయంలో విమానం కొన్ని సెకన్ల వ్యవధిలోనే 17 వేల అడుగులకు పైగా కిందికి పడిపోయినట్లు విమాన ట్రాకింగ్ డేటా వెల్లడించింది.
దీంతో విమానంలోని ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
వివరాలు
ప్రయాణికులు, ఆఫ్‌డ్యూటీ పైలట్లతో తప్పిన పెను ప్రమాదం
దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ హమ్మామీని అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో కాక్‌పిట్ తలుపు తెరుచుకోవడంతో లోపల జరుగుతున్న పరిణామాలు ప్రయాణికులకు తెలిసాయి.
దీంతో ప్రయాణికులు కలిసి హమ్మామీని అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్‌డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుకొచ్చారు.
వారు విమాన నియంత్రణను చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేలా వారు సహకరించారు.