నేపాల్ కొత్త ప్రధానిగా 'ప్రచండ' ప్రమాణ స్వీకారం
నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని షేర్ బహదుర్ దేవ్బా తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కొత్త ప్రధానిగా సీపీఎన్-మావోయిస్టు సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' సోమవారం ప్రమాణ స్వీకారం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చిన్న పార్టీల మద్దతుతో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నేపాల్ ప్రధాన మంత్రిగా ప్రచండ ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. శీతల్ నివాస్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రచండతో రాష్ట్రపతి భండారీ ప్రమాణం చేయించారు.
కేపీ శర్మ ఓలి మద్దతు
ఇటీవల నేపాల్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలు విజయాన్ని అందించారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో.. ప్రధాని పదవి దేవ్బాకు ఖరారైంది. ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఈ క్రమంలో ప్రధాని పదవి ఆశించిన ప్రచండ.. ఆశాభంగంతో.. సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రచండ.. తన పాత మిత్రడు 'సీపీఎన్-యూఎంఎల్' ఛైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని కలిసి మద్దతు అడిగారు. ఓలి మద్దతు తెలపడంతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతో ప్రచండ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.