పాక్‌లో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు; లీటరు పెట్రోల్ రూ.272, డీజిల్ రూ.280
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది ప్రభుత్వం. పాక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ రూ.272కు, డీజిల్ ధర రూ.280కి చేరింది. తాజాగా పెట్రోల్ ధర రూ.22పెరగగా, డీజిల్ ధర రూ.17.20ను ప్రభుత్వం హైక్ చేసింది. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తాయారైంది. ఆర్థిక సంక్షోభ నివారణకు 170బిలియన్ల పాకిస్థాన్ కరెన్సీని సమకూర్చడమే లక్ష్యంగా వస్తువులు, సేవల పన్నును 18శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని గంటల్లో ఇంధన ధరలు పెరిగాయి.
ఈ ఏడాది ప్రథమార్థంలో పాక్ ద్రవ్యోల్బణం 33 శాతానికి చేరొచ్చు: నిపుణులు
కిరోసిన్ ధరలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం లీటరు కిరోసిన్ పాక్‌లో రూ.202.73 అమ్ముతున్నారు. ఇది బ్లాక్‌లో రూ.500వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో పాకిస్థాన్ ప్రభుత్వం మనీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 'మినీ బడ్జెట్' తర్వాత పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలో ద్రవ్యోల్బణం సగటున 33 శాతానికి చేరుకోవచ్చని మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ఎల్ కత్రినా తెలిపారు. ఐఎంఎఫ్‌తో చర్చలు సఫలమైనా ఆ సంస్థ అందించే 1.1 బిలియన్ డాలర్లతో పాక్ ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లో పెట్టడం కష్టమే అని అంటున్నారు. పాక్‌లో లీటరు పాల ధర రూ. 210 కాగా, కోడి మాంసం కిలో రూ.780 పలుకుతున్నాయి.