లీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్
ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల్లోనే పాల ధరలు రూ. 30 వరకు పెరిగాయి. దీంతో పాక్‌లో లీటరు పాల ధర రూ. 210కి చేరింది. లైవ్ బ్రాయిలర్ చికెన్ ధర గత రెండు రోజుల్లో కిలోకు భారీగా పెరిగింది. ప్రస్తుతం లైవ్ పక్షి కేజీ 480-500 అమ్ముతున్నట్లు 'డాన్' పత్రిక నివేదించింది. రెండు రోజుల క్రితం కోడి మాంసం ధర రూ.620-650 ఉండగా, ప్రస్తుతం అది రూ.700-780 పెరిగినట్లు డాన్ వెల్లడించింది. బోన్ లెస్ చికెన్ కిలో రూ.1,000-1,100 పలుకుతున్నట్లు తెలిపింది.
విద్యుత్, సుంకాలను పెంచిన పాక్ ప్రభుత్వం
1,000 మంది దుకాణదారులు పాలను పెంచిన రేటుకు విక్రయిస్తున్నట్లు కరాచీ మిల్క్ రిటైలర్స్ అసోసియేషన్ మీడియా కోఆర్డినేటర్ వహీద్ వెల్లడించారు. తక్కువ విదేశీ నిల్వలు, నగదు కొరత కారణంగా పాకిస్థాన్ అత్యంత దారుణమైన ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి( ఐఎంఎఫ్)తో ఒప్పందం సందిగ్ధంలో పడటంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో విద్యుత్, గ్యాస్ సుంకాలను కూడా పెంచింది. అవసరమైన డబ్బును అన్‌లాక్ చేయడానికి ఐఎంఎఫ్ అధికారులతో చర్చలు తిరిగి ప్రారంభించిన వెంటనే పాక్ ప్రభుత్వం పెరిగిన ధరలను అమలు చేస్తోంది.