Page Loader
వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, కంటెంట్‌పై అభ్యంతరాలు
ఇస్లాం చట్టాలకు విరుద్ధంగా కంటెంట్ ఉందని వికీపీడియాను బ్లాక్ చేసిన పాకిస్థాన్

వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, కంటెంట్‌పై అభ్యంతరాలు

వ్రాసిన వారు Stalin
Feb 04, 2023
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాయాది దేశం పాకిస్థాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నందునే బ్యాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) వెల్లడించింది. ఇస్లాం చట్టాలకు విరుద్ధంగా, దైవదూషణ కంటెంట్‌లో ఉందని, దాన్ని పూర్తిగా తొలగించాలని వికీపీడియాకు పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ 48గంటల సమయం ఇచ్చింది. వికీపీడియా ప్రతినిధి అథారిటీ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. నిర్ణీత సమయంలో పూర్తిస్థాయిలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడంలో విఫమైందని, అలాగే ప్రతినిధి కూడా హాజరు కాలేదని పీటీఏ పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్‌లపై ఆంక్షలు విధించడం ఇది మొదటి సారి కాదు. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆ దేశంలోని ప్రజాస్వామిక వాదులు తప్పుపట్టారు.

పాకిస్థాన్

కంటెంట్‌ను పూర్తిస్థాయిలో తొలగిస్తే అన్ బ్లాక్: పాకిస్థాన్

ఇస్లాం చట్టాలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను పూర్తిస్థాయిలో తొలగిస్తే వికీపీడియాను అన్ బ్లాక్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పీటీఏ ప్రతినిధి మలహత్ ఒబైద్ చెప్పారు. ఈ విషయంపై అధికార యంత్రాంగం ఇంకా వికీపీడియా అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ముస్లింలు మెజారిటీలో సంఖ్యలో ఉన్న పాకిస్థాన్‌లో ఇస్లాం చట్టాలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను ఉపేక్షించబోమని, అవి పూర్తిస్థాయిలో తొలగించాలని బుధవారమే వికీపీడియాను కోరినట్లు పీటీఏ చెప్పింది. పాకిస్థాన్‌లో దైవదూషణ అనేది ఒక సున్నితమైన సమస్య. దైవదూషణ చేస్తే ఉరిశిక్ష విధించవచ్చని ఇస్లాం చట్టాలు చెబుతున్నాయి.