America: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వేళ.. 400 మిలియన్ బ్యారెల్స్ చమురు విడుదలకు IEAతో అమెరికా ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈపరిస్థితుల్లో పెట్రోలు ధరలను తగ్గించే ప్రయత్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనప్పుడు ఉపయోగించేందుకు నిల్వ ఉంచిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్(Strategic Petroleum Reserve)నుంచి ముడి చమురును విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈవిషయాన్ని ఆయన WKRC Local 12కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఎంత పరిమాణంలో చమురును విడుదల చేస్తామన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రస్తుతం విడుదల చేసిన చమురును తరువాత దశలో మళ్లీ నిల్వలను నింపుతామని చెప్పారు. గతంలో ఇంధన ధరలు తగ్గించేందుకు రిజర్వ్ వినియోగించినందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను తాను విమర్శించిన విషయాన్ని కూడా ట్రంప్ గుర్తుచేశారు.
వివరాలు
ప్రపంచ స్థాయి చమురు విడుదల ప్రణాళిక
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగా ఉండేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ(IEA)పలు దేశాల పెట్రోలియం నిల్వల నుంచి మొత్తం 400మిలియన్ బ్యారెల్స్ చమురును విడుదల చేయడానికి సమన్వయం చేసేందుకు అంగీకరించిందన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్,"ప్రపంచంలోని పలు దేశాల జాతీయ పెట్రోలియం నిల్వల నుంచి రికార్డు స్థాయిలో 400 మిలియన్ బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు IEA అంగీకరించింది. దీని వల్ల చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయి.అమెరికా,ప్రపంచానికి ఉన్న ఈ ముప్పును ఎదుర్కొనే సమయంలో ఇది పెద్ద సహాయంగా ఉంటుంది," అని చెప్పారు. ఇరాన్‌తో సైనిక చర్యలు కొనసాగుతున్న సమయంలో ప్రపంచ ఇంధన సరఫరా స్థిరంగా ఉండేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని తెలిపారు.
వివరాలు
ఇరాన్ నౌకాదళంపై భారీ దాడులు చేశామని ట్రంప్ వ్యాఖ్యలు
"ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిరంతరం కొనసాగేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది," అని ట్రంప్ అన్నారు. ఇరాన్ నౌకాదళంపై అమెరికా భారీ దాడులు జరిపిందని ట్రంప్ పేర్కొన్నారు. సముద్ర మార్గాల్లో రవాణాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నౌకాదళ యూనిట్లపై దాడులు చేసినట్లు చెప్పారు. "మేము వారి 58 నౌకలను ధ్వంసం చేశాం. వారి నౌకాదళాన్ని పూర్తిగా దెబ్బతీశాం," అని ట్రంప్ తెలిపారు. అంతేకాకుండా వాణిజ్య నౌకా మార్గాలకు ముప్పుగా ఉపయోగించేందుకు ఇరాన్ సముద్రంలో పెట్టిన మైన్లను కూడా అమెరికా దళాలు నిర్వీర్యం చేశాయని అన్నారు. "వారు నీటిలో మైన్లు పెట్టారు. వాటిని ఏర్పాటు చేసే 31 నౌకలను మేము ధ్వంసం చేశాం," అని ట్రంప్ పేర్కొన్నారు.
వివరాలు
ప్రత్యేక ఆయుధాలతో కొనసాగుతున్న ఆపరేషన్లు
సముద్ర మార్గాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉపయోగించే అధునాతన ఆయుధ వ్యవస్థలను ఈ ఆపరేషన్‌లో కూడా ఉపయోగించామని ట్రంప్ వెల్లడించారు. "సముద్ర మార్గాల్లో వచ్చే డ్రగ్ రవాణాను అడ్డుకునేందుకు ఉపయోగించే ఆయుధాన్ని ఎందుకు ఉపయోగించామంటే,దాని వల్ల సముద్ర మార్గాల్లో డ్రగ్ రవాణా 98 శాతం వరకు తగ్గింది. అది చాలా ప్రభావవంతమైన ఆయుధం. దాన్ని ఉపయోగించి చూద్దామని నిర్ణయించాం. అది చాలా బాగా పనిచేసింది," అని ట్రంప్ చెప్పారు.
వివరాలు
ప్రత్యేక ఆయుధాలతో కొనసాగుతున్న ఆపరేషన్లు
అమెరికా తన వ్యూహాత్మక లక్ష్యాలు సాధించే వరకు ఈ సైనిక చర్యలు కొనసాగుతాయని కూడా ఆయన స్పష్టం చేశారు. "మధ్యలో ఆపేయాలనే ఉద్దేశం లేదు. పని పూర్తయ్యే వరకు కొనసాగించాల్సిందే," అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై జరిపిన ఈ దాడి "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో నిర్వహించామని, ఉగ్రవాద పాలనగా ఆయన పేర్కొన్న ఇరాన్ నుంచి వచ్చే ముప్పును తొలగించడం దీని లక్ష్యమని ట్రంప్ తెలిపారు.