LOADING...
Farooq Abdullah: ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం..వివాహ వేడుకలో ఉద్రిక్తత
ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం..వివాహ వేడుకలో ఉద్రిక్తత

Farooq Abdullah: ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం..వివాహ వేడుకలో ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమవడంతో ఫరూక్‌ అబ్దుల్లా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేకుండా ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

వివరాలు 

వివాహ వేడుకలో ఘటన

బుధవారం జమ్మూ శివార్లలోని ఓ హోటల్‌లో జరిగిన వివాహ వేడుకకు ఫరూక్‌ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి సురీందర్‌ ఛౌదరీ కూడా అక్కడ ఉన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో తుపాకీతో ఫరూక్‌పై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని కొట్టారు కూడా. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

నిందితుడి గుర్తింపు

ఈ ఘటనలో అరెస్టైన నిందితుడిని పోలీసులు జమ్మూకి చెందిన 63 ఏళ్ల కమల్‌సింగ్‌ జమ్వాల్‌గా గుర్తించారు. జమ్మూలో దుకాణాలు నిర్వహిస్తున్న కమల్‌సింగ్‌ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. గత 20 ఏళ్లుగా ఫరూక్‌ అబ్దుల్లాను చంపాలనే ఉద్దేశంతో ఉన్నానని అతడు పోలీసులకు తెలిపాడు. ఇదే తన వ్యక్తిగత అజెండా అని కూడా పేర్కొన్నాడు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీకి తన వద్ద చట్టబద్ధమైన లైసెన్స్‌ ఉన్నట్లు నిందితుడు వెల్లడించాడు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Advertisement

వివరాలు 

భద్రతా లోపంపై విమర్శలు

తన తండ్రిపై జరిగిన హత్యాయత్నంపై జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. లోడ్‌ చేసిన తుపాకీతో ఓ వ్యక్తి తన తండ్రిపై కాల్పులకు ప్రయత్నించాడని చెప్పారు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆ ప్రయత్నం విఫలమైందని తెలిపారు. ఫరూక్‌ అబ్దుల్లాకు జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న విషయాన్ని కూడా ఒమర్‌ గుర్తుచేశారు. ఇంతటి భద్రత ఉన్నప్పటికీ నిందితుడు అంత దగ్గరగా ఎలా చేరుకున్నాడని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ ఘటన భద్రతా వైఫల్యం కారణంగానే జరిగిందని ఉప ముఖ్యమంత్రి సురీందర్‌ ఛౌదరీ కూడా వ్యాఖ్యానించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాపై కాల్పుల యత్నం

Advertisement