Hyderabad: మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధం.. త్వరలో రూ.7 వేల కోట్ల పనులు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచేలా మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఎంతటి భారీ వరద వచ్చినా తట్టుకునే రక్షణ గోడలు, ప్రజలకు ఆహ్లాదాన్నిపంచే పార్కులు,రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే వాణిజ్య సముదాయాలతో మూసీకి కొత్త రూపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇప్పటికే పూర్తైంది. దీనిపై వివిధ రంగాల నిపుణులు,రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి వారి సలహాలు,సూచనలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ముందుకు సాగనుంది. మొదటి దశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు సుమారు 21 కిలోమీటర్ల పరిధిలో పునరుజ్జీవ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
వివరాలు
వేలాది మందికి ఉపాధి అవకాశాలు
ఇందుకోసం సుమారు రూ.7వేల కోట్ల వ్యయంతో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరాలకు దీటుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును సమగ్ర చర్చలతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పనులు పూర్తయ్యాక నగరం మధ్యగా నిత్యం స్వచ్ఛమైన నీటితో ప్రవహించే నది,చుట్టూ ప్రకృతి అందాలు నగరవాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. రోజంతా పనిచేసే హోటళ్లు, భారీ షాపింగ్‌మాల్స్,ఎత్తైన భవనాలు,విద్యుద్దీపాలతో ప్రకాశించే మూసీ పరీవాహక ప్రాంతం రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా మారే అవకాశముంది. దీంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ లక్ష్యాలతో ప్రభుత్వం ప్రాజెక్టుకు తుది రూపు ఇచ్చింది.త్వరలోనే ప్రాజెక్టు లక్ష్యాలను అధికారికంగా ప్రకటించి తదుపరి కార్యాచరణను వెల్లడించనుంది.
వివరాలు
సియోల్ జుంగ్‌నాంగ్ నమూనాలో మురుగునీటి శుద్ధి వ్యవస్థ
మూసీ నదిలోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నదికి ఇరువైపులా భారీ ట్రంక్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగునీటిని సేకరిస్తారు. ఆ పైపులైన్లను మురుగునీటి శుద్ధి కేంద్రాలకు (ఎస్టీపీలకు) అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం మురుగునీరు రెండు దశల్లో మాత్రమే శుద్ధి అవుతోంది. ఇకపై మూడు దశల్లో శుద్ధి చేసి ఆ నీటిని నిర్మాణ రంగం,పరిశ్రమలు,నగర పచ్చదనం పెంపు కోసం పునర్వినియోగం చేయాలని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే నాలుగు ఎస్టీపీలలో ఒకదాన్ని పూర్తిగా భూగర్భంలో నిర్మించనున్నారు. ఇది దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో ఉన్న జుంగ్‌నాంగ్ అండర్‌గ్రౌండ్ ఎస్టీపీ - సియోల్ సైన్స్ మ్యూజియం నమూనాలో ఉంటుంది. పైభాగంలో అందమైన పార్కు, నీటి కొలను, క్రీడా మైదానం ఏర్పాటు చేస్తారు.
వివరాలు
విస్తృత మాస్టర్‌ప్లాన్
మూసీ నది నగరంలోని జంట జలాశయాల నుంచి తూర్పున ఉన్న గౌరెల్లి గ్రామం వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. నదికి ఇరువైపులా ఒక కిలోమీటరు పరిధిని కలుపుకుని ప్రభుత్వం సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోంది. మొత్తంగా 110.91 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బృహత్తర ప్రణాళిక అమలు కానుంది.
వివరాలు
వరదలకు తట్టుకునేలా రక్షణ చర్యలు
1908 సెప్టెంబరు 28న హైదరాబాద్‌లో జరిగిన ఘోర వరద విపత్తు చరిత్రలో నిలిచిపోయింది. మూసీ నది ఉప్పొంగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.అలాంటి విపత్తు మళ్లీ వచ్చినా నగరానికి ఎలాంటి నష్టం కలగకుండా ఎంఆర్‌డీసీఎల్ (మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 9.2 కి.మీ ఈసీ నది,అలాగే ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 11.8 కి.మీ మూసీ నది ఇరువైపులా భారీ రక్షణ గోడలు నిర్మించనున్నారు. లక్షన్నర క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ గోడలను రూపొందించనున్నారు. ఈ గోడకు ఒకవైపున 100 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మిస్తారు.
వివరాలు
వంతెనలు, పార్కులు, నడక మార్గాలు
మూసీ-ఈసీ నదుల మధ్య ఉన్న భూభాగం వైపున 60 అడుగుల రహదారి అభివృద్ధి చేస్తారు. మొత్తం 50 మీటర్ల బఫర్ జోన్‌లో 60 అడుగులు రహదారికి కేటాయించి, మిగిలిన భూమిని పార్కుల అభివృద్ధికి వినియోగిస్తారు. మంచిరేవుల, నార్సింగి, సన్‌సిటీ తదితర ప్రాంతాలకు అనుసంధానం కల్పించేందుకు మూసీ మరియు ఈసీ నదులపై 15 వంతెనలు నిర్మించనున్నారు. బాపూఘాట్ వరకు నది పరీవాహక ప్రాంతాన్ని పచ్చిక బయళ్లు, పూల తోటలతో అందంగా అభివృద్ధి చేస్తారు. మధ్య మధ్యలో పిల్లలు ఆడుకునే పార్కులు, నడకదారులు, సైకిల్ ట్రాక్‌లు, హోటళ్లు ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
'గాంధీ సరోవర్' ప్రత్యేక ఆకర్షణ
జంట జలాశయాల నుంచి తూర్పున ఉన్న ఓఆర్‌ఆర్ వరకు ఈస్ట్-వెస్ట్ కారిడార్‌ను కలుపుతూ విశాలమైన రహదారులు నిర్మించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. మొదటి దశలో బాపూఘాట్ వరకు గరిష్ఠ వరద ప్రవాహ మట్టానికి తగినంత ఎత్తులో రహదారులను అభివృద్ధి చేస్తారు. బాపూఘాట్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ (పైవంతెన) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత బాపూఘాట్ ప్రాంతంలో గాంధీ సరోవర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మూసీ, ఈసీ, గోదావరి జలాలు కలిసే త్రివేణి సంగమం వద్ద నదుల మధ్య ఉన్న భూమిపై 100 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మిస్తారు. ఈ టవర్‌పై ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం - "స్టాచ్యూ ఆఫ్ పీస్" ప్రతిష్ఠించనున్నారు.
వివరాలు
'గాంధీ సరోవర్' ప్రత్యేక ఆకర్షణ
టవర్ దిగువ భాగంలో పలు అంతస్తుల్లో గాంధీ జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే చిత్రాలు, వస్తువులు, ఫొటోలతో మ్యూజియం ఏర్పాటు చేస్తారు. అదే ప్రాంతంలో లండన్ ఐ తరహాలో భారీ రంగుల రాట్నం, గాంధేయవాద విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ స్థాయి చర్చలకు అనువైన సెమినార్ హాల్ కూడా నిర్మించనున్నారు.