Loading...
Nepal: నేపాల్‌లో మళ్లీ భగ్గుమన్న జెన్-జీ ఆందోళనలు.. నిర్వాసితుల తరలింపుపై యువత ఆగ్రహం
నిర్వాసితుల తరలింపుపై యువత ఆగ్రహం

Nepal: నేపాల్‌లో మళ్లీ భగ్గుమన్న జెన్-జీ ఆందోళనలు.. నిర్వాసితుల తరలింపుపై యువత ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్కడి జెన్-జీ యువత మరోసారి ఆందోళన బాట పట్టింది. ఖట్మాండూలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న నిర్వాసితులను బాలేన్ షా నేతృత్వంలోని స్థానిక పరిపాలన అమానవీయంగా సంరక్షణ కేంద్రాలకు తరలిస్తోందని ఆరోపిస్తూ యువత నిరసనలు చేపడుతోంది. సరైన పునరావాస ప్రణాళిక లేకుండానే పేద కుటుంబాలను హఠాత్తుగా తరలించడం అన్యాయమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ నిరసనలు కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. నదీతీరాల వెంబడి అక్రమంగా నివసిస్తున్న పేదలను వరద ముప్పు నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంరక్షణ కేంద్రాలకు తరలిస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో మానవతా దృక్పథం పాటించకుండా వ్యవహరిస్తున్నారని జెన్-జీ యువత ఆరోపిస్తోంది.

వివరాలు 

బైక్‌కు వీల్ లాక్ వేశారనే ఆగ్రహంతో నిప్పంటించుకున్న ఓ యువకుడు

ముందస్తు పునరావాస ఏర్పాట్లు చేయకుండా ప్రజలను బలవంతంగా తరలించడం తగదంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఇటీవల మరో ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

పోలీసులు తన బైక్‌కు వీల్ లాక్ వేశారనే ఆగ్రహంతో ఓ యువకుడు తనపై తాను నిప్పంటించుకోవడం సంచలనం సృష్టించింది.

ఈ ఘటన తర్వాత ప్రభుత్వ తీరుపై విమర్శలు మరింత పెరిగాయి.

గత శుక్రవారం కొందరు నిర్వాసితులను అధికారులు బలవంతంగా సంరక్షణ కేంద్రాలకు తరలించడంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. ఈ ఘటనలో గాయపడిన ఓ సామాజిక కార్యకర్తను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాలు 

గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని జెన్-జీ డిమాండ్

నేడు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఖట్మాండూలోని ఓ ప్రభుత్వ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ప్లాకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువత ఆందోళన వ్యక్తం చేసింది.

పేదలను చిత్రహింసలకు గురి చేయకుండా గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ తీరుపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆందోళనల సందర్భంగా అరెస్టు చేసిన సామాజిక కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిరసనలు బాలేన్ షా పరిపాలనకు కీలక సవాలుగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ADVERTISEMENT