
German: జర్మన్ యువరాజు హెరాల్డ్ గుండెపోటుతో మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్‌జోలెర్న్ (63) గుండెపోటుతో మృతి చెందారు. వజ్రాల వ్యాపారంతో సంబంధం ఉన్న కారణంగా ఆయన నమీబియాలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల అక్కడే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను ఆయన భార్య జోసెఫా వాన్ హోహెన్‌జోలెర్న్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నమీబియాలో పర్యటనలో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి తన భర్త మృతి చెందారని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
జోసెఫాకు 'యువరాణి' బిరుదు
జర్మనీలో ఆమె రాసిన ప్రకటనలో, "ప్రియమైన లియోన్‌బర్గ్ వాసులారా, ఈ రోజు నా హృదయం బరువెక్కిపోయింది. నా ప్రియమైన భర్త హెరాల్డ్ అనూహ్యంగా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం నన్నెంతగానో బాధిస్తోంది"అని జోసెఫా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి కాగా, త్వరలో బిడ్డకు జన్మనివ్వనుంది. జీవిత భాగస్వామి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆమె, ఈ బాధను బహిరంగంగా పంచుకున్నారు. హెరాల్డ్‌తో వివాహం తరువాత జోసెఫాకు 'యువరాణి' బిరుదు లభించింది. వీరిద్దరూ 2024 సెప్టెంబర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. జూలై నెలలో జోసెఫా ప్రసవించనున్నారు. అయితే ఆమె భర్త బిడ్డను చూడకముందే కన్నుమూయడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ప్రస్తుతం జోసెఫా జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలో లియోన్‌బర్గ్ మేయర్‌గా తిరిగి ఎన్నికల బరిలో నిలిచారు.
వివరాలు
ఎన్నికల ప్రచారానికి విరామం
అయితే ఈ ఘటన నేపథ్యంలో ఆమె ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. "నా జీవితంలో ఈ క్షణం చాలా దుఃఖంతో నిండిపోయింది. భర్తకు వీడ్కోలు చెప్పడానికి, పుట్టబోయే బిడ్డ కోసం కొంత సమయం కావాలి. అందుకే రాబోయే ఎన్నికల్లో నేను ప్రచారంలో పాల్గొనలేను. అలాగే సోషల్ మీడియా నుంచి కూడా తాత్కాలికంగా దూరంగా ఉంటున్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ఆమె పేర్కొన్నారు. ఆమె భర్తతో ఉన్న కొన్ని పాత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. హెరాల్డ్, జోసెఫా మధ్య పరిచయం 2022లో ఓ వాణిజ్య ప్రదర్శన సమయంలో ఏర్పడింది.
వివరాలు
జర్మన్ విప్లవంతో రాజవంశ అధికారాన్ని కోల్పోయింది
ఆ పరిచయం ప్రేమగా మారి,వివాహానికి దారితీసింది.జోసెఫాకు సంగీతం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది ఆమె తరచూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అందుకే ఆమెను స్థానికంగా 'గాన మేయర్'అని అభిమానంగా పిలుస్తారు. 2020లో జోసెఫా బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలోని లియోన్‌బర్గ్ మున్సిపాలిటీలో ఆర్థిక మేయర్ పదవికి పోటీ చేశారు. 33ఓట్లలో 17ఓట్లు సాధించి, 8ఏళ్ల పదవీకాలంతో 2021 మేలో మేయర్‌గా ఎన్నికయ్యారు. హెరాల్డ్ వాన్ హోహెన్‌జోలెర్న్ అనేది ఓ పురాతన రాజవంశానికి చెందిన పేరు. ఈ వంశ చరిత్ర 1061సంవత్సరానికి చెందింది.ఈ రాజవంశం బ్రాండెన్‌బర్గ్, ప్రుస్సియా, రొమేనియా, జర్మన్ సామ్రాజ్యాలతో సంబంధాలున్న గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం జరిగిన జర్మన్ విప్లవంతో ఈ రాజవంశ అధికారాన్ని కోల్పోయింది.