Page Loader
The Golconda Blue: భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం!
భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం!

The Golconda Blue: భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాజుల దగ్గర మెరిసిన అరుదైన నీలి వజ్రం 'ది గోల్కొండ బ్లూ'ను వేలం వేయడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ఇందౌర్‌, బరోడా మహారాజుల వద్ద వెలుగొందిన ఈ అత్యంత విలువైన వజ్రం ఇప్పుడు మే 14న జెనీవాలో జరగనున్న క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ వేలంలో భాగంగా హాజరవుతోంది. ఇది 23.24 క్యారెట్ల వజ్రం కాగా, దాదాపు రూ.430 కోట్లు ధర పలికే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా మాట్లాడుతూ, దీని రాజ వారసత్వం, అసాధారణ నీలి రంగు, పరిమాణం కారణంగా 'ది గోల్కొండ బ్లూ' ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లూ డైమండ్లలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.

Details

1923లో గుర్తింపు

ఈ వజ్రం అసలైన మూలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరు అని చెబుతున్నారు. గతంలో ఇందౌర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్-II వద్ద ఈ వజ్రం ఉండేది. 1923లో ఆయన తండ్రి ఈ వజ్రాన్ని ఓ బ్రాస్‌లెట్‌లో గుర్తించారు. అనంతరం ఆభరణాల పునర్నిర్మాణం సమయంలో దీనిని ఇందౌర్ పియర్ వజ్రాలతో తయారుచేసిన నెక్లెస్‌లో అమర్చారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఫ్రెంచ్ కళాకారుడు బెర్నార్డ్ బౌటెట్ డిమోన్వెల్ వేసిన చిత్రంలో ఇందౌర్ మహారాణి ధరించిన ఆభరణాలలో ఇది ఉన్నట్లు గుర్తించారు. 1947లో ప్రఖ్యాత న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం ఇది బరోడా మహారాజు వద్దకు చేరి, ఇప్పుడది మళ్లీ ప్రపంచ వేదికపై వెలుగు చూడనుంది.