చైనా రక్షణ మంత్రి మిస్సింగ్.. రెండు వారాలుగా అదృశ్యం
చైనాలో రాజకీయ అస్థిరతపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు మిస్సింగ్ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. లీ షాంగ్‌ఫు రెండు వారాల పాటు బహిరంగంగా కనిపించడం లేదు. చివరిసారిగా బీజింగ్‌లో జరిగిన 3వ చైనా-ఆఫ్రికా శాంతి, భద్రతా ఫోరమ్ సదస్సులో కనిపించారు. జపాన్‌లోని అమెరికా రాయబారి ఇమాన్యుయేల్ చైనా రక్షణ మంత్రి మిస్సింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే విదేశాంగ మంత్రి హోదాలో ఉండగానే చిన్‌గాంగ్ కనిపించకుండాపోయారు. అలాగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఇద్దరు కమాండర్లు కూడా అదృశ్యమయ్యారు. తాజాగా లీ షాంగ్‌ఫు మిస్ కావడం గమనార్హం.