Loading...
Flydubai: 39 డిగ్రీల కోణంలో భూమివైపు.. చివరికి విరిగిన రడ్డర్‌తో సేఫ్‌ ల్యాండింగ్
39 డిగ్రీల కోణంలో భూమివైపు.. చివరికి విరిగిన రడ్డర్‌తో సేఫ్‌ ల్యాండింగ్

Flydubai: 39 డిగ్రీల కోణంలో భూమివైపు.. చివరికి విరిగిన రడ్డర్‌తో సేఫ్‌ ల్యాండింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లైదుబాయ్‌ విమానం 'FZ1073' సురక్షితంగా ల్యాండ్‌ కావడం ఏవియేషన్‌ రంగంలో అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ విమానంలోని కోపైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ.. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై అత్యవసర సమయంలో ఉపయోగించే 'క్రాష్‌ యాక్స్‌' (గొడ్డలి)తో విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ దాడి కారణంగా విమానం అసాధారణ స్థాయిలో అదుపు తప్పినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా విశ్లేషణలో వెల్లడైంది. ఒక దశలో విమానం దాదాపు నిటారుగా భూమి వైపు దూసుకెళ్లినట్లు డేటా సూచిస్తోంది. ఆ తర్వాత విమానం తిరిగి నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. అప్పటికే భౌతికంగా దెబ్బతినడంతో ల్యాండింగ్‌ చేయడం పైలట్లకు తీవ్ర సవాలుగా మారిందని అమెరికా మీడియా సంస్థ ఒక కథనంలో వెల్లడించింది.

వివరాలు

దాదాపు శబ్ద వేగాన్ని అందుకుని..

ఫ్లైదుబాయ్‌ FZ1073 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ శ్రేణికి చెందిన భారీ విమానం. ఈ విమానం అత్యధికంగా మ్యాక్‌ 0.82 వేగాన్ని మాత్రమే తట్టుకోగలదని సమాచారం.

దీనికి మించిన వేగంతో ప్రయాణిస్తే విమానం భౌతికంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

అయితే దాడి జరిగిన సమయంలో FZ1073 ఏకంగా 0.96 మ్యాక్‌ వేగంతో భూమి దిశగా దూసుకెళ్లడం ప్రారంభించినట్లు ఫ్లైట్‌రాడార్‌24 డేటా వెల్లడించింది.

సాధారణంగా 1 మ్యాక్‌ అంటే శబ్ద వేగానికి సమానం. అంటే ఈ విమానం దాదాపు శబ్ద వేగానికి చేరువగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విమానం 0.96 మ్యాక్‌ కంటే కూడా ఎక్కువ వేగంతో ప్రయాణించి ఉండొచ్చని సమాచారం.

వివరాలు

92 సెకన్లలో 17 వేల అడుగులు కిందకు..

అయితే బ్లాక్‌బాక్స్‌ వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే విమానం కచ్చితంగా ఎంత వేగంతో ప్రయాణించిందనే విషయం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.

విమానం ఒక్కసారిగా కిందకు పడిపోతున్న సమయంలో దానిపై సాధారణ స్థాయికి మించి కొన్ని రెట్ల జీ-ఫోర్స్‌ (గురుత్వాకర్షణ శక్తి) పడింది.

దీని ప్రభావంతో విమానం దిశను మార్చేందుకు ఉపయోగించే రడ్డర్‌ (Rudder) దెబ్బతిన్నట్లు సమాచారం. సాధారణంగా ల్యాండింగ్‌ సమయంలో విమానం ముక్కుభాగం సుమారు 3 డిగ్రీల కోణంలో కిందకు దిగుతుంది.

అయితే ఫ్లైదుబాయ్‌ FZ1073 మాత్రం అక్టోబర్‌ 1న ఏకంగా 39 డిగ్రీల కోణంలో భూమి వైపు దూసుకెళ్లినట్లు ఫ్లైట్‌ డేటా విశ్లేషణలో వెల్లడైంది.

ADVERTISEMENT

వివరాలు

17,000 అడుగుల ఎత్తును కోల్పోయింది

మరోవైపు.. విమానం కేవలం 92 సెకన్లలో 17,000 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఆ సమయంలో విమానం బాడీపై సాధారణ జీ-ఫోర్స్‌ కంటే మూడు రెట్లు అదనంగా ఒత్తిడి పడినట్లు తెలుస్తోంది.

సాధారణంగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ తరహా విమానం గరిష్ఠంగా 2.5 పాజిటివ్‌ జీ-ఫోర్స్‌ వరకు తట్టుకోగలదు. వాణిజ్య విమానాలకు కూడా ఇదే పరిమితి వర్తిస్తుంది.

అలాగే విమానం దిశను మార్చుకోవాలంటే సాధారణంగా గరిష్ఠంగా 230 నాట్స్‌ వేగం వరకు మాత్రమే సాధ్యమవుతుంది.

అయితే FZ1073 ఏకంగా 0.96 మ్యాక్‌ వేగాన్ని అందుకోవడంతో దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం కూడా పైలట్లకు పెద్ద సవాలుగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

అదుపులోకి వచ్చినా.. డ్యామేజీ తప్పలేదు

విమానంలో ప్రయాణిస్తున్న డెడ్‌హెడ్‌ పైలట్స్‌ అంటే తమ విధులు ముగించుకుని తిరిగి వెళ్తున్న లేదా మరో ప్రాంతంలో విధులకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తున్న పైలట్లు.. విమానం కంట్రోల్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

వారు విమానాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకురాగలిగినప్పటికీ.. అప్పటికే విమానం తోక భాగంలోని రడ్డర్‌ దెబ్బతింది.

దీంతో విమానానికి నష్టం తప్పలేదు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో కూడా మరోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

విమానం అకస్మాత్తుగా 500 అడుగుల ఎత్తును కోల్పోవడం వంటి ఘటనలు కూడా జరిగినట్లు సమాచారం.

వివరాలు

ప్రస్తుతం సౌదీలోనే విమానం

ప్రస్తుతం ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానం సౌదీ అరేబియాలోనే ఉండిపోయింది. ఈ విమానాన్ని తిరిగి సేవల్లోకి తీసుకురావచ్చా లేదా అనే విషయాన్ని నిపుణులు నిర్ణయించాల్సి ఉంది.

విమానం ఎయిర్‌ఫ్రేమ్‌తో పాటు దాని అన్ని కీలక భాగాలను నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు.

పూర్తి స్థాయి పరిశీలన అనంతరం విమానాన్ని మళ్లీ వినియోగించవచ్చా? లేదా అన్నది నిర్ధారించనున్నారు.

ADVERTISEMENT