చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు
చైనాలో తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీజింగ్‌లో భారీ వర్షం కారణంగా కనీసం 11 మంది మరణించారు. మరో 27మంది గల్లంతైనట్లు చైనా ప్రభుత్వ మీడియా మంగళవారం తెలిపింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం సైనిక హెలికాప్టర్లను మోహరించింది. చైనాలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జూలై నెల మొత్తంలో దాదాపు సగటు వర్షపాతం కేవలం 40 గంటల్లో బీజింగ్‌లో పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ముడు రోజుల్లో ఏ స్థాయిలో వర్షాపాతం నమోదైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
1.5లక్షల ఇళ్లుకు నిలిచిపోయిన నీటి సరఫరా
జూలై 31న బీజింగ్‌లోని ఫాంగ్‌షాన్, మెంటౌగౌతో సహా ప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మూడు రైళ్లు వరదల్లో చిక్కుకుపోయాయి. రైళ్లలోని ప్రయాణికులు దాదాపు 30గంటల పాటు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. కొన్ని ప్రాంతాలలో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బీజింగ్‌లోని నైరుతి ఫాంగ్‌షాన్ పరిసరాల్లో వరద నీటిలో సగం మునిగిపోయిన బస్సుల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెంటౌగౌలోని దాదాపు 150,000 గృహాలకు నీటి సరఫరా నిలిచిపోయినట్లు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ వార్తాపత్రిక బీజింగ్ డైలీ తెలిపింది. వాటర్ ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజింగ్‌తో హెబీ ప్రావిన్స్‌కు కూడా అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.