LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై దొంగతనం నెపంతో మూక దాడి.. ప్రాణభయంతో నీటిలో మునిగి మృతి
ప్రాణభయంతో నీటిలో మునిగి మృతి

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై దొంగతనం నెపంతో మూక దాడి.. ప్రాణభయంతో నీటిలో మునిగి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా,దొంగతనం,ఆరోపణలతో కొందరు వ్యక్తులు వెంబడించడంతో, ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక హిందూ యువకుడు కాలువలో దూకి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నౌగావ్ జిల్లాలోని మహాదేవ్‌పూర్ ఉపజిల్లాలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం,చాక్‌గోరి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ళ మిథున్ సర్కార్‌ను కొందరు వ్యక్తులు దొంగతన ఆరోపణలతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో,మిథున్ సమీపంలోని లోతైన కాలువలో దూకాడు. అయితే, అక్కడ నీటి ప్రవాహం బలంగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయాడు. సంఘటన సమాచారంతో పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత మిథున్ మృతదేహాన్ని వెలికితీశారు.

వివరాలు 

గత 19 రోజుల్లో హిందువులపై జరిగిన దాడుల్లో ఇది ఏడో ఘటన 

మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారి షాహిదుల్ ఇస్లాం మాట్లాడుతూ, "దొంగతనం నెపంతో కొందరు వ్యక్తులు యువకుడిని వెంబడించడంతో కాలువలోకి దూకినట్లు ప్రాథమికంగా తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించాం. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. గత 19 రోజుల్లో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల్లో ఇది ఏడో ఘటన కావడం గమనార్హం. ఈ వారంలోనే ఇది మూడో దాడి.

వివరాలు 

మైనారిటీలపై వరుస దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన 

సోమవారం నర్సింగ్డి జిల్లాలో శరత్ చక్రవర్తి, జషోర్ జిల్లాలో రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యక్తులు దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. డిసెంబరులో అయితే, దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్‌ను ఓ వ్యక్తి మూకతో కొట్టి చంపి, చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, మైనారిటీల, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్నాయి, ఇది తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

Advertisement