LOADING...
Indian students: 'పాలక్‌ పనీర్‌' వివాదం.. భారత విద్యార్థులకు రూ.1.8 కోట్ల పరిహారం
'పాలక్‌ పనీర్‌' వివాదం.. భారత విద్యార్థులకు రూ.1.8 కోట్ల పరిహారం

Indian students: 'పాలక్‌ పనీర్‌' వివాదం.. భారత విద్యార్థులకు రూ.1.8 కోట్ల పరిహారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా చేసిన దీర్ఘ న్యాయపోరాటం చివరకు విజయం సాధించింది. 'పాలక్‌ పనీర్‌' వంటకం విషయంలో జరిగిన అన్యాయంపై పోరాడినందుకు యూనివర్సిటీ నుంచి వారికి భారీగా పరిహారం లభించింది. ఈ కేసులో బాధితులుగా ఉన్న ఇద్దరు భారతీయులకు మొత్తం 2 లక్షల డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించేందుకు యూనివర్సిటీ అంగీకరించింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఆదిత్య ప్రకాశ్‌,పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఊర్మి భట్టాచార్య 2022లో పీహెచ్‌డీ చదవడానికి అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడోలో చదువుకుంటున్న సమయంలో 2023 సెప్టెంబర్‌ 5న ఈ వివాదం మొదలైంది.

వివరాలు 

ఆసియా వంటకాలపై వివక్ష

లంచ్‌ కోసం ఆదిత్య తన డిపార్ట్‌మెంట్‌ స్టాఫ్‌ క్యాంటీన్‌లో మైక్రోవేవ్‌లో పాలక్‌ పనీర్‌ వేడి చేసుకునేందుకు వెళ్లగా, అక్కడి సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. భారతీయ ఆహారం వల్ల భరించలేని వాసన వస్తోందని చెబుతూ, ఆ వంటకాన్ని వేడి చేయొద్దని సూచించారు. ఈ ఘటనతో తీవ్రంగా బాధపడిన ఆదిత్య, తన స్నేహితురాలు ఊర్మి భట్టాచార్యతో కలిసి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే, వారి ఫిర్యాదుపై యాజమాన్యం ఎలాంటి స్పందన చూపలేదు. అనంతరం కూడా ఆసియా వంటకాలపై వివక్ష చూపుతున్న ఘటనలు పునరావృతమైనప్పటికీ, యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వివాదాన్ని మరింత పెంచింది.

వివరాలు 

భారతీయ విద్యార్థులకు 2 లక్షల డాలర్ల పరిహారం

ఇదిలా ఉండగా, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఊర్మిని టీచింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా, వారి మాస్టర్స్‌ డిగ్రీలను ఇవ్వడానికి కూడా యూనివర్సిటీ నిరాకరించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో న్యాయం కోసం వీరిద్దరూ కొలరాడోలోని డిస్ట్రిక్ట్‌ కోర్టును ఆశ్రయించి సివిల్‌ కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణ నేపథ్యంలో యూనివర్సిటీ వెనక్కి తగ్గి, విద్యార్థులతో సెటిల్‌మెంట్‌కు ముందుకొచ్చింది. ఇద్దరు భారతీయ విద్యార్థులకు 2 లక్షల డాలర్ల పరిహారం చెల్లించడంతో పాటు, వారి మాస్టర్స్‌ డిగ్రీలను కూడా అందజేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఈ వివాదం ముగిసింది. ఇటీవలే ఆదిత్య, ఊర్మి ఇద్దరూ స్వదేశానికి తిరిగి వచ్చారు.

Advertisement

వివరాలు 

ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం

ఈ ఘటన గురించి తాజాగా ఊర్మి భట్టాచార్య సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. "తినే ఆహారం విషయంలో స్వేచ్ఛ కోసం కూడా మేం పోరాడాల్సి వచ్చింది.ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం. రెండేళ్ల న్యాయపోరాటం తర్వాత పరిహారం సాధించి, గర్వంగా భారత్‌కు తిరిగొచ్చాం" అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement