
Houthi Missile Strikes: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు.. నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది
ఈ వార్తాకథనం ఏంటి
ఎర్ర సముద్రం(Red Sea)లో హౌతీ తిరుగుబాటుదారుల భీభత్సం ఇప్పటికీ ఆగడం లేదు.
హౌతీ (Houthi) మిలిటెంట్లు మరోసారి వాణిజ్య నౌకపై దాడి చేశారు. ఆ తర్వాత సిబ్బంది ఓడను ఎర్ర సముద్రంలో విడిచిపెట్టారు.
వాణిజ్య జలమార్గంపై హౌతీలు దాడి చేసిన తర్వాత ఇలా నౌకను వదలిపెట్టి వెళ్లిపోవడం ఇదే తొలిసారి.
హౌతీలు రెండు క్షిపణులతో బెలిజ్ జెండా ఉన్న ఇంగ్లండ్‌లో రిజిస్టరైన రూబీమార్ నౌకపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ సోమవారం వెల్లడించింది.
హౌతీ మిలిటెంట్లు దాడి చేసిన వెంటనే నౌకలోని సిబ్బంది వెంటనే అత్యవసర యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు కాల్ చేశారు.
దీంతో ఒక యుద్ధనౌక, మరో వాణిజ్య నౌక సహాయంగా వచ్చి సిబ్బందిని రక్షించి ఓడరేవుకు తీసుకువెళ్లాయి.
ఎర్ర సముద్రం
నౌక మునిగిందంటూ హౌతీల ప్రకటన
రూబీమార్ అనేది ఒక చిన్న కార్గో షిప్. దాడి తర్వాత ఈ బ్రిటిష్ నౌక మునిగిపోయిందని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
అయితే ఇందులో వాస్తవం ఉందా అనేది తెలియాల్సి ఉంది. రూబీమార్ మునిగిపోయిందా లేదా అనే విషయాన్ని ఎవరూ అధికారికంగా దృవీకరించలేదు.
ఓడ యజమాని కూడా దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, గతేడాది నుంచి ఎర్ర సముద్రంలో హౌతీలు వ్యాపారి నౌకాదళంపై తమ దాడులను పెంచారు.
ఇజ్రాయెల్, యూఎస్, బ్రిటన్‌లకు సంబంధించిన నౌకలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మద్దతుగల హౌతీ మిలిటెంట్ గ్రూప్ పేర్కొంది.
గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం, వైమానిక దాడులను నిలిపివేయాలని హౌతీలు డిమాండ్ చేస్తూ.. హౌతీ మిలిటెంట్లు ఈ దాడులు చేస్తున్నారు.