LOADING...
UN: రంజాన్ మాసంలో నరమేధం.. పాక్‌పై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం
రంజాన్ మాసంలో నరమేధం.. పాక్‌పై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం

UN: రంజాన్ మాసంలో నరమేధం.. పాక్‌పై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల అంశంపై ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా, మొత్తం ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పుగా మారాయని స్పష్టం చేసింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ.. పాకిస్థాన్ దాడుల్లో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్ఏఎంఏ) నివేదికలను ప్రస్తావిస్తూ, ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 372 మంది పౌరులు మృతి చెందగా, మరో 397 మంది గాయపడినట్లు తెలిపారు.

వివరాలు 

సామాన్య పౌరుల మరణాలపై ఐరాస వేదికగా ఆందోళన

ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన దాడుల్లో అధిక సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళనకరమని ఆయన అన్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగే హింసాత్మక చర్యలు ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కావని భారత్ స్పష్టం చేసింది. అదే సమావేశంలో ఐరాస నివేదికల విశ్వసనీయతను పాకిస్థాన్ ప్రశ్నించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బహుళపక్ష వ్యవస్థ, ఐక్యరాజ్యసమితి పట్ల మద్దతు అనేది అవసరానికి అనుగుణంగా అంగీకరించే అంశం కాదని, నచ్చినప్పుడు ఒప్పుకుని, నచ్చనప్పుడు తిరస్కరించడం సరికాదని హరీశ్ పర్వతనేని పాకిస్థాన్‌కు ఘాటుగా బదులిచ్చారు.

వివరాలు 

రంజాన్ మాసంలో పౌరుల మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్

ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు యూఎన్ఏఎంఏ చేపడుతున్న కార్యక్రమాలకు భారత్ సంపూర్ణ మద్దతు కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలతో పాటు మానవతా విలువలను ప్రతి దేశం గౌరవించాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐరాస ప్రధాన కార్యదర్శి చేసిన పిలుపును భారత్ సమర్థిస్తోందని చెప్పారు. ఈ దాడులపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని యూఎన్ఏఎంఏ చేసిన డిమాండ్‌కు కూడా భారత్ మద్దతు ప్రకటించింది. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనే ఇటువంటి దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని భారత్ మరోసారి స్పష్టం చేసింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐరాసలో మాట్లాడుతున్న పర్వతనేని హరీష్ 

Advertisement