సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు
సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ జాతి వివక్షకు గురైంది. అయితే అది ఇప్పుడు కాదు. 2021లో ఈ ఘటన జరిగింది. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 2021లో 57 ఏళ్ల హిందోచా నీతా విష్ణుభాయ్.. చువా చు కాంగ్ హౌసింగ్ సొసైటీలో వాకింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు చెమటలు రావడంతో మాస్క్‌ను కిందకు లాగింది. ఆ సమయంలో వాంగ్ జింగ్ ఫాంగ్ అనే వ్యక్తి తన వద్దకు వచ్చి మాస్క్ ఎందుకు సరిగా ధరించలేదని ఛాతీపై తన్నడమే కాకుండా, జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు కోర్టుకు హిందోచా నీతా వివరించింది.
హిందోచానే నాపై ఉమ్మివేసింది: వాంగ్ జింగ్ ఫాంగ్
2021లో జరిగిన సంఘటనను ఇంకా మర్చిపోలేకపోతున్నానని హిందోచా నీతా విష్ణుభాయ్ కోర్టుకు చెప్పారు. ఆ సమయంలో వాకింగ్ చేయడం వల్ల ఆయాసం వచ్చి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వల్లే తాను మాస్క్‌ను కిందకు లాగినట్లు హిందోచా కోర్టుకు తెలిపారు. హిందోచా చేసిన ఆరోపణలను వాంగ్ ఖండించారు. హిందోచా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయలేదని, ఆమెపై ఛాతీపై కూడా తన్నలేదని వాంగ్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అంతేకాదు, హిందోచానే తనపై ఉమ్మివేసిట్లు ఆరోపించారు వాంగ్. హిందోచా కూడా వాంగ్ ఆరోపణలను ఖండించారు.