Page Loader
అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ
రిచర్డ్ వర్మకు కీలక పదవిని కట్టబెట్టిన బైడెన్

అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ

వ్రాసిన వారు Stalin
Dec 24, 2022
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని కట్టబెట్టాడు. భారతీయ మూలాలున్న రిచర్డ్ వర్మను అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా నామినేట్ చేశారు. వర్మ ప్రస్తుతం మాస్టర్‌కార్డ్‌లో చీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా ఉన్నారు. ఒబామా హయాంలో అతను భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ రాయబారి, లెజిస్లేటివ్ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు వర్మకు అమెరికా సెనేటర్ హ్యారీ రీడ్కి జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన అనుభవం కూడా ఉంది.

రిచర్డ్ వర్మ

అనేక అవార్డులు, రివార్డులు..

ప్రభుత్వ పరంగానే కాకుండా.. ప్రైవేటు రంగంలో కూడా విశిష్ట సేవలు అందించారు వర్మ. ఆసియా గ్రూప్ వైస్ ఛైర్మన్‌గా, స్టెప్‌టో అండ్ జాన్సన్ ఎల్ఎల్‌పీలో భాగస్వామిగా, సీనియర్ కౌన్సెలర్‌గా పనిచేశారు. ఆల్‌బ్రైట్ స్టోన్‌బ్రిడ్జ్ గ్రూప్‌లో సీనియర్ కౌన్సెలర్‌గా ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా పని చేసిన అనుభవం అతనికి ఉంది. అలాగే.. రిచర్డ్ వర్మ అందించిన సేవలకు ఆయన్ను చాలా అవార్డులు వరించాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి విశిష్ట సేవా పతకం, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫెలోషిప్, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌తో అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.