LOADING...
Khalistan referendum: SFJ రిఫరెండంలో 'కిల్ ఇండియా' నినాదాలు.. భారత్‌-కెనడా మధ్య కొత్త ఉద్రిక్తత
భారత్‌-కెనడా మధ్య కొత్త ఉద్రిక్తత

Khalistan referendum: SFJ రిఫరెండంలో 'కిల్ ఇండియా' నినాదాలు.. భారత్‌-కెనడా మధ్య కొత్త ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని ఓటావాలో ఆదివారం (నవంబర్ 23) "ఖలిస్తాన్ రిఫరెండం" పేరుతో SFJ నిర్వహించిన కార్యక్రమంలో "Kill India" అంటూ నినాదాలు వినిపించటంతో, అలాగే భారత జెండాను అవమానించడంతో మరోసారి ఇండియా-కెనడా సంబంధాలపై ప్రశ్నార్థక వాతావరణం నెలకొంది. 2023లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు తీవ్రంగా దిగజారాయి. ఇప్పుడు దాదాపు ఏడున్నరేళ్ల తర్వాత వాణిజ్య చర్చలు పునఃప్రారంభమవుతుండగా, ఈ తాజా పరిణామం సంబంధాలపై మరోసారి ప్రభావం చూపే అవకాశముంది.

వివరాలు 

భారత జెండాను అవమానిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

ఆదివారం ఓటావాలో భారత్‌లో నిషేధిత సంస్థ అయిన "సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ)" నిర్వహించిన అనధికారిక రిఫరెండంలో వేలాది మంది కెనడియన్ సిక్కులు పాల్గొన్నారు. కొందరు "కిల్ ఇండియా" అంటూ నినాదాలు చేస్తే, మరికొందరు భారత జెండాను అవమానిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత ప్రభుత్వం అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద నిషేధించిన SFJ, "స్వతంత్ర సిక్కు పంజాబ్" కోసం ఈ రిఫరెండాలను నిర్వహిస్తున్నది. 2022 సెప్టెంబర్ నుంచి కెనడాలో నిర్వహిస్తున్న రిఫరెండమ్స్‌లో ఇదే ఏడోది.గతంలో బ్రాంప్టన్, సరీ, మిస్సిసాగ, కాల్గరీల్లో ఇదే తరహా రౌండ్లు నిర్వహించారు.

వివరాలు 

నవ్వుల పాలయ్యే నాటకం

ఈసారి మాత్రం 53,000 మందికి పైగా సిక్కులు ఒంటారియో,అల్బర్టా,బ్రిటిష్ కొలంబియా,క్యూబెక్ రాష్ట్రాల నుంచి రెండు కిలోమీటర్ల వరుసలో నిలబడి ఓటు వేశారని SFJ ప్రకటించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు గంటల తరబడి లైన్లో నిలబడ్డారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి,భారత్ తీవ్రవాదిగా గుర్తించిన గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా శాటిలైట్ మెసేజ్ ద్వారా మాట్లాడాడు. ఈ రిఫరెండంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కెనడాలో భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్,ఇది "నవ్వుల పాలయ్యే నాటకం" తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించారు. "సాధారణ నిరసనలు లేదా ప్రజాస్వామ్య ప్రక్రియలో డిమాండ్లు చెయ్యడం మాకు అభ్యంతరం కాదు. కానీ ఇలా కెనడాలో కెనేడియన్లే నిర్వహించే రిఫరెండం అనేది విచిత్రమే"అని ఆయన CBC న్యూస్‌కి చెప్పారు.

వివరాలు 

రిఫరెండమ్‌తో ఏ సంబంధమూ లేదు

ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో కెనడా జోక్యం గా కనిపిస్తాయని, అదే విధంగా కెనడాలో జరిగే భారత కార్యకలాపాలను అక్కడి వారు జోక్యంగానే భావిస్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ రిఫరెండం ప్రత్యేకత ఏంటంటే.. అదే రోజు దక్షిణాఫ్రికాలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం. "ఈ సమావేశానికి సంబంధించిన ప్రణాళిక ముందునుంచే ఉంది, రిఫరెండమ్‌తో ఏ సంబంధమూ లేదు" అని కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ తెలిపారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య భద్రతా చర్చలు, చట్ట అమలు వ్యవహారాలు ప్రధాన అంశాలుగా ఉంటాయని కూడా ఆమె చెప్పారు.

వివరాలు 

వాణిజ్యాన్ని $50 బిలియన్లకు రెట్టింపు చేయడమే లక్ష్యం

గత కొంతకాలంగా కెనడా-ఇండియా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వ కాలంలో నీజర్ హత్య ఆరోపణల వల్ల ఏర్పడిన ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాలు మళ్లీ చర్చలకు ముందుకొస్తున్నాయి. ఆదివారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రెండు దేశాలు CEPA అనే సమగ్ర ఆర్థిక ఒప్పందంపై తిరిగి చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $50 బిలియన్లకు రెట్టింపు చేయడమే లక్ష్యం. యురేనియం సరఫరా, సివిల్ న్యూక్లియర్ రంగంలో సహకారం వంటి అంశాలు కూడా దృష్టిలో పెట్టుకున్నారు.

వివరాలు 

ఇండియా-కెనడా సంబంధాలపై ప్రభావం 

అయితే, ఈ ఖలిస్తాన్ రిఫరెండమ్‌ మరోసారి ఇండియా-కెనడా సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక సంవత్సరాలుగా కెనడాలో ఖలిస్తానీ వర్గాలు పెరుగుతున్నాయని, అవి భారత అభ్యంతరాలకు కారణమవుతున్నాయని న్యూఢిల్లీ స్పష్టంగానే చెబుతూ వస్తోంది. ఈ సంఘటనతో ఆ అంశం మరోసారి ప్రధాన చర్చగా మారింది