Hormuz: హర్మూజ్ జలసంధిపై ఇరాన్ టోల్ వసూళ్లు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకలపై ఇరాన్ తొలిసారిగా రుసుము వసూలు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్ పార్లమెంట్ ఉపసభాపతి హమీద్‌రెజా వెల్లడించారు. వసూలైన మొత్తం తమ సెంట్రల్ బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. అయితే ఈ రుసుము ఏ దేశానికి చెందిన నౌక నుంచి వసూలు చేశారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి టోల్ విధానాన్ని ఇరాన్ గతంలోనే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఆదాయాన్ని దేశ పునర్నిర్మాణ పనులకు వినియోగించనున్నట్లు కూడా అప్పుడే ప్రకటించింది.
వివరాలు
తాజా నిబంధనలు ఇవే..
ఇరాన్ రూపొందించిన తాజా నిబంధనల ప్రకారం, నిర్ణయించిన రుసుములు చెల్లించిన నౌకలకు మాత్రమే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. ఇటీవల ఒక ట్యాంకర్ ఈ మార్గంలో ప్రయాణించేందుకు 2 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఈ పన్ను విధానం అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అదనంగా, నౌక యజమానులు, అందులో ఉన్న సరుకు వివరాలు, అలాగే గమ్యస్థానం వంటి సమాచారాన్ని ముందుగానే టెహ్రాన్ అధికారులకు అందించాల్సి ఉంటుంది.
వివరాలు
ఎంత చెల్లించాలంటే..
సాధారణంగా ప్రతి బ్యారెల్ ముడి చమురుపై 1 డాలర్ చొప్పున రుసుము విధిస్తున్నారు. ఈ ప్రకారం, ఒక నౌకలో 2 మిలియన్ బ్యారెల్‌ల చమురు ఉంటే, మొత్తం 2 మిలియన్ డాలర్లు చెల్లించాలి. ఈ చెల్లింపులు చైనా యువాన్ లేదా క్రిప్టో కరెన్సీ రూపంలోనే స్వీకరిస్తున్నారు. రుసుము చెల్లింపులు పూర్తైన తర్వాత, ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల నుంచి ఐఆర్‌జీసీకి చెందిన నౌకలు ఆ వాణిజ్య నౌకలకు రక్షణగా సాగుతాయని సమాచారం.