Iran protests: రణరంగమైన ఇరాన్.. ఇంటర్నెట్ బంద్; 45 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు అదుపు తప్పింది. ఆర్థిక సమస్యలపై మొదలైన ఆందోళనలు, ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా మారాయి. భద్రతా దళాలనూ, నిరసనకారులనూ మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు 45 మందికి పైగా మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. హింసాత్మక ఘటనలు,రోడ్లపై రణరంగం గత 12 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు,ఇప్పుడు హింసాత్మకంగా మారి టెహ్రాన్ వీధులు రణరంగంగా మారాయి. ఆర్థిక సంక్షోభం,ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం కారణంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. టెహ్రాన్‌తో పాటు దేశంలోని 31 ప్రావిన్స్‌లలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు "డెత్ టు ఖమెనీ, డెత్ టు డిక్టేటర్" అంటూ నినాదాలు చేస్తున్నారు.
వివరాలు
ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు నిలిపివేత
దశాబ్దాలుగా గూడుకట్టుకున్న అసహనం ఒక్కసారిగా లావాగా పేలింది. ఆకలి, జీవన సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఇప్పుడు విప్లవ నినాదాలు చేస్తున్నారు. టెహ్రాన్ వీధుల్లో భద్రతా దళాలు ఒక వైపు, వేలాది మంది నిరసనకారులు మరొక వైపు చూస్తే పరిస్థితి వణుకును రేకెత్తిస్తుంది. గాలిలో భాష్పవాయువు, చెవుల్లో తూటాల శబ్దం, ఎటు చూసినా మంటలు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ప్రపంచం నుంచి ఇరాన్‌ను వేరు చేసేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించారు. దీంతో ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.
వివరాలు
టెహ్రాన్‌కు విమాన రాకపోకలు రద్దు
టెహ్రాన్‌లోని చారిత్రాత్మక గ్రాండ్ బజార్‌లో నిరసనకారులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. భద్రతా దళాలు బాష్పవాయువును ఉపయోగించి ఆందోళనకారులను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. టెహ్రాన్ సహా ఇతర నగరాల్లో సుమారు 2,000 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణాల కారణంగా రన్‌వేను సైన్యం తన అదీనంలోకి తీసుకుంది. ఫలితంగా టెహ్రాన్‌కు విమాన రాకపోకలు రద్దు అయ్యాయి.
వివరాలు
ప్రజాగ్రహానికి అసలు కారణం
ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడం, ద్రవ్యోల్బణం 42.5 శాతానికి పెరగడం ప్రధాన కారణం. నిత్యావసర వస్తువులు కొంటే సామాన్య ప్రజలకు కష్టమవుతోంది. ప్రజలు "ముల్లాలు దిగిపోవాలి, సర్వాధికారికి మరణం" అంటూ వీధుల్లో నినాదాలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్పందనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. నిరసనకారులపై హింస కొనసాగితే సీరియస్ ఫాలో-అప్ ఉంటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి (UN) కూడా శాంతియుత నిరసన హక్కును గౌరవించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది. భారత విదేశాంగ శాఖ ఇప్పటికే సురక్షిత సూచనలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు కాని వరకు టెహ్రాన్ వెళ్లవద్దని, అక్కడ ఉన్న భారతీయులు ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో సంప్రదింపులో ఉండాలని సూచించింది.