Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని 60 రోజులు ఓపెన్ చేయనున్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-యూఎస్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన చర్చలు వేగం పుంజుకున్నాయి. ఈ అంశంపై ఎప్పుడైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం. ఇరు దేశాలు 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో హర్ముజ్ జలసంధిని 60 రోజుల పాటు తెరిచి ఉంచడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి కీలక అంశాలు ఉన్నట్లు పేర్కొంది. అదనంగా హర్మూజ్ జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించేందుకు కూడా ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం.
వివరాలు
స్వేచ్ఛగా చమురు ఎగుమతులు చేసే అవకాశం
ఒప్పందం అమల్లోకి వస్తే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్ ప్రపంచ దేశాలకు తిరిగి స్వేచ్ఛగా చమురు ఎగుమతులు చేసే అవకాశం లభిస్తుందని తెలిపింది. ఈ ముసాయిదా ఒప్పందంలో అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్‌పై దాడులు చేయకూడదనే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఇరాన్ కూడా అమెరికా లేదా దాని మిత్రదేశాలపై ఎలాంటి ముందస్తు దాడులకు పాల్పడకూడదనే షరతు ఇందులో భాగంగా ఉందని సమాచారం.
వివరాలు
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
అదేవిధంగా ఖతార్ బ్యాంకుల్లో స్తంభింపజేసిన 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.55 వేల కోట్లు) ఇరాన్ ఆస్తులను విడుదల చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అంగీకరించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అంశం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే ఇరాన్ సమీప ప్రాంతాల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కు పిలిపిస్తామని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.