Loading...
Benjamin Netanyahu: 'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌'.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌'.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

Benjamin Netanyahu: 'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌'.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా వివాదానికి తెరతీశారు. బ్రిటన్‌ను 'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌'గా అభివర్ణించిన ఆయన.. అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్‌ దేశంగా యూకే మారబోతోందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెతన్యాహు వ్యాఖ్యలపై బ్రిటన్‌ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్‌ ఆర్మీ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. 1967 యుద్ధ సమయంలో బ్రిటన్‌ మీడియా నుంచి ఇజ్రాయెల్‌కు లభించిన మద్దతును ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌ నుంచి అలాంటి మద్దతును ఆశించలేమని వ్యాఖ్యానించారు.

వివరాలు

నెతన్యాహు వ్యాఖ్యలపై యూకే ఆగ్రహం

ఈ క్రమంలోనే బ్రిటన్‌ను 'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌'తో పోల్చారు. ఇంటర్వ్యూయర్‌ "యూరప్‌ అంతా ఇలాగే ఉంది కదా?" అని ప్రశ్నించగా.. నెతన్యాహు స్పందిస్తూ, "అవును.. కానీ ఎవరో అన్నట్లుగా అణ్వాయుధాలు కలిగిన తొలి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ బ్రిటనే కాబోతోందని వ్యాఖ్యానించారు.

నెతన్యాహు చేసిన వ్యాఖ్యలను బ్రిటన్‌ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు "పూర్తిగా ఆమోదయోగ్యం కావు" అని స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి దౌత్య మార్గాల్లో తమ నిరసనను తెలియజేసినట్లు పేర్కొంది. వివాదం మరింత ముదరడంతో నెతన్యాహు కార్యాలయం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గత అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఆయన కేవలం ఉటంకించారని తెలిపింది.

వివరాలు

'అణ్వాయుధ దేశం పాకిస్థాన్‌'..  

అయితే నెతన్యాహు వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1998 నుంచే పాకిస్థాన్‌ అణ్వాయుధాలు కలిగిన 'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌'గా కొనసాగుతున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో "తొలి అణ్వస్త్ర ఇస్లామిక్‌ దేశం బ్రిటనే" అని నెతన్యాహు పేర్కొనడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై బ్రిటన్‌ ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించింది.

దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలోనే దెబ్బతిన్నాయి. తాజాగా నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఈ దౌత్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి.

ADVERTISEMENT